అతిలోక సుందరి శ్రీదేవి హవా సాగుతున్న రోజులు. దేశంలోనే ఆమె అందరి కలల రాణిగా వెలుగొందుతున్న కాలం. ఆమె కోసం యువత పిచ్చెక్కిపోతున్న తరుణం. ఆమె ఊ అంటే ఎందరో ఆమెని వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చే కాలం అది. కానీ సావిత్రిలానే శ్రీదేవి కూడా రెండో పెళ్లి వాడు అయిన బోనీకపూర్‌ని వివాహం చేసుకుంది. ఈ క్రమంలో బోనీకపూర్ మొదటి భార్య, ఆమె పిల్లలు శ్రీదేవిని ఇబ్బంది పెట్టారు. పలువురు పోయి పోయి రెండో పెళ్లి వాడి వలలో ఎలా పడ్డావు? అని అంటున్నారు. బోనీకపూర్ మొదటి భార్య శ్రీదేవిని నిండు వేడుకలో చెంపమీద కొట్టి అవమానపరిచింది. కానీ శ్రీదేవి మాత్రం బోనీకపూర్‌నే పెళ్లి చేసుకుంది.
ఇక తాజాగా ఆమె భర్త బోనీకపూర్ మాట్లాడుతూ, శ్రీదేవిని తొలిసారి వెండితెరపై చూసినప్పుడే ఆమె ప్రేమలో పడిపోయాను. మొదట్లో నాది వన్‌సైడ్ లవ్. ఆమెతో సినిమా నిర్మించాలని, ఆమె చేత అగ్రిమెంట్ చేయించేందుకు చెన్నై వెళ్లాను. కానీ ఆ సమయంలో ఆమె అక్కడలేరు. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించాను. ఆమెకు, ఆమె నటనకు నేను ఫిదా అయిపోయాను. ఓ నటిగా శ్రీదేవి తెచ్చుకున్న గుర్తింపు, ఖ్యాతి నన్ను మెప్పించాయి. బహుశా అవే ఆమెతో పీకల్లోతు ప్రేమలో పడటానికి కారణం అయ్యాయేమో...?శ్రీదేవితో నా ప్రేమకథ తెరచిన పుస్తకం వంటిది. మా హృదయాల్లో ఏముందో మేము పలు కార్యక్రమాలలో ఓపెన్‌గా చెప్పుకున్నాం. ఆమె నా జీవితంలో ప్రతిక్షణం వెన్నుదన్నుగా నిలిచారు. శ్రీదేవి మరణంతో ఏర్పడిన లోటు తీర్చలేనిది. ఆమె వదిలేసి వెళ్లిన గుడ్‌విల్, గుడ్ విషెష్‌తో మేం జీవించగలుగుతున్నాం.
ఆమె నాతోనే ఉన్నారు. నా జ్ఞాపకాలలోనే ఉన్నారు. నా పిల్లల రూపంలో ఆమె ఉంది. ఆమెలేని లోటును నేను, నా పిల్లలు ప్రతిక్షణం ఫీలవుతూనే ఉన్నాం. ఆమె ఊహించని రీతిలో మాకు దూరం అయిపోయారు... అని చెప్పుకొచ్చాడు. బోనీ, శ్రీదేవి కలిసి 1993లో 'రూపోంకి రాణి చోరోంకా రాజా', 1997లో 'జుదాయి', సినిమాల కోసం పనిచేశారు. 1996లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఇక శ్రీదేవి చివరి చిత్రం 'మామ్'ని కూడా బోనీనే నిర్మించాడు.