రజనీకాంత్, చిరంజీవి, నారాయణరావు, రాజేంద్రప్రసాద్, ప్రసాద్‌బాబు, హరిప్రసాద్, పిచ్చకొట్టుడు సుధాకర్ వంటి వారందరు కాస్త అటు ఇటుగా ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నారు. వీరిలో రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్ వంటి వారే క్లిక్ అయ్యారు. ఇక నారాయణరావు విషయానికి వస్తే ఆయన టాలెంట్ చూసి ఏకంగా దర్శకదిగ్గజం కె.బాలచందర్ ఎంతగానో మెచ్చుకుని, ఆయనకు పలు చిత్రాలో మంచి వేషాలు ఇచ్చాడు. కానీ హార్డ్‌వర్క్ లేకనో, మరో కారణం చేతనో ఆయన ఏదో చిన్నచితకా పాత్రలు తప్ప నటునిగా పెద్దగా రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం ఆయన మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు.
ఇక ఈయన నిర్మాతగా కూడా మారి చిరంజీవితో ‘దేవాంతకుడు, చట్టానికి కళ్లులేవు, యముడికి మొగుడు’ వంటి పలు చిత్రాలను నిర్మించాడు. ఈయన తాజాగా మాట్లాడుతూ.. ‘దేవాంతకుడు’ చిత్రం షూటింగ్ సమయంలోని విశేషాలను పంచుకున్నాడు. 1984లో ఈ చిత్రం వచ్చింది. చిరంజీవి అంకిత భావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన వల్ల షూటింగ్ ఆలస్యం కావడాన్ని ఆయన అసలు ఒప్పుకోడు. సీన్ అనుకున్న విధంగా రావడానికి ఎంతైనా కష్టపడతాడు. ఆ ప్రయత్నంలో గాయలైనా లెక్కచేయడు. ఈ చిత్రం సమయంలో చిరంజీవికి మోకాలి నొప్పి ఇబ్బంది పెట్టింది. దాంతో డాక్టర్ల సలహా మేరకు ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు.
అప్పుడు ఆ సినిమాలో చిరంజీవి, ఆయన చెల్లి పాత్రధారులపై ‘చెల్లెమ్మకు పెళ్లంట.. అన్నయ్యకు సంబరమంట’ అనే పాటను చిత్రీకరించాల్సివుంది. అయినా సరే ఇప్పుడు వద్దులే.. మరలా చేసుకుందాం అన్నాను. దానికి చిరంజీవి ఒప్పుకోలేదు. లేదు.. లేదు.. షూటింగ్ చేద్దామని సెట్స్‌కి వచ్చేశాడు. చెప్పాను కదా ఆయన హార్డ్‌వర్కర్ అని. అందుకే ఆయన ఎవరు చెప్పినా షూటింగ్ విషయంలో రాజీపడడు.. అని చెప్పుకొచ్చాడు.