బాహుబలితో బహు పాపులర్ అయిన ప్రభాస్ ప్రస్తుతం మరో బిగ్ ప్రాజెక్ట్ అయినా సాహో సినిమాలో నటిస్తున్నాడు. గత ఏడాది ప్రారంభమైన సాహో సినిమా ఈ ఏడాది చివరి నాటికీ కూడా విడుదలయ్యే ఛాన్స్ అయితే కనబడడం లేదు. ప్రస్తుతం షూటింగ్ ప్రాసెస్ లో ఉన్న సాహో సినిమా భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ వారు దేశంలోని పలు భాషల్లో నిర్మిస్తున్నారు. బాహుబలితో వరల్డ్ వైడ్ గా పేరు సంపాదించిన ప్రభాస్ సాహో చిత్రంపై అందరిలోనూ అమితాసక్తి ఉంది. అందుకే సాహో సినిమాని కూడా ఇండియా వైడ్ గా విడుదల చెయ్యడానికి భారీ ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.
అయితే బాహుబలి టైం లోనే ప్రభాస్ కి బాలీవుడ్ లో ఒక బిగ్ ప్రాజెక్ట్ లో ఆఫర్ రావడం... దానిని ప్రభాస్ రిజెక్ట్ చెయ్యడం జరిగిందనే టాక్ ఒకటి ఇప్పుడు వినబడుతుంది. అది కూడా సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన పద్మావత్ చిత్రంలో అనేది టాక్. పద్మావత్ చిత్రంలో పద్మావతికి భర్తగా నటించిన షాహిద్ కపూర్ ప్లే చేసిన మహా రావల్ రతన్ సింగ్ పాత్రకి దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి ప్రభాస్ ని సంప్రదించగా ప్రభాస్ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ల కాంబోలో వచ్చిన పద్మావత్ చిత్రం ఎన్ని కాంట్రవర్సీలతో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అయితే ప్రభాస్ ఈ చిత్రాన్ని ఎందుకు రిజెక్ట్ చేశాడో గానీ... ఒక చారిత్రాత్మక చిత్రంలో నటించే ఛాన్స్ మాత్రం మిస్ చేసుకున్నాడనే చెప్పాలి.
బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఫిలింలో చెయ్యడం అంటే మామలు విషయం కాదు. కానీ ప్రభాస్ మాత్రం షాహిద్ చేసిన మహా రావల్ రతన్ సింగ్ రోల్ కి పెద్దగా పేరుండదని చెయ్యలేదో.. లేదంటే కాల్షీట్స్ లేక చెయ్యలేదో కానీ మంచి ఆఫర్ ని మాత్రం మిస్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇప్పట్లో లేకపోయినా.. సాహో తర్వాత పక్కగా బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ తో కలిసి ఒక మూవీ చేస్తాడనేది మాత్రం తెలిసిన విషయమే.