ప్రస్తుతం సోషల్ మీడియా విస్తృతం అయిన తర్వాత ఐస్ బకెట్ చాలెంజ్ వంటి వాటివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయినా అందులో కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. ఇక కేంద్రమంత్రి, మాజీ ఒలింపిక్ పతక విజేత రాజ్యవర్దన్‌సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఫిట్‌నెస్ చాలెంజ్ ఎంతో మంచి కాన్సెప్ట్. ఇక ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారంకి తోడుగా గ్రీన్‌చాలెంజ్ కూడా సమాజానికి ఎంతో ముఖ్యమైంది. ఇందులో పలువురు ప్రముఖులు పాల్గొనడం వల్ల ఈ ఉద్యమం మరింత ఉద్దృతం కావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఎవరు ఏమి చెప్పినా వినని ఫ్యాన్స్ తమ అభిమాన నటులో, ఆటగాళ్లో చెబితే మాత్రం బాగా ఇన్‌స్పైర్ అవుతారు.
అదే సమయంలో కికి చాలెంజ్ మాత్రం ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. ఇది నిజానికి కడుపునిండా తిని అరగని వారు చేసే పని, అందునా ఇది ఇండియాలోని రోడ్లు, ఇక్కడి ట్రాఫిక్‌కి ఏమాత్రం వీలుకాదు. ఇప్పటికే ఇలా కదులుతున్న కారులోంచి బయటకి దూకి, డ్యాన్స్ చేస్తూ మరలా డ్రైవింగ్ సీట్లోకి ఎగిరి కూర్చోవడం అనేది పరమ చెత్త కాన్సెప్ట్. కానీ మంచి కంటే చెడే ఎక్కువగా సమాజంలో, యువతలో ప్రభావం చూపుతుంది. శంకరాభరణం చూసి ఎంతమంది సంగీతం వైపు అడుగులు వేశారు? సాగరసంగమం చూసి ఎందరు డ్యాన్స్ నేర్చుకున్నారు? రుద్రవీణ, చాలెంజ్, స్వయంకృషి వంటి చిత్రాలు చూసి ఎందరు ఇన్‌స్పైర్ అయ్యారు? కుల రహిత సమాజం కోసం పాటుపడుతున్నారు? అనేది పక్కనపెడితే శివ, అర్జున్‌రెడ్డి వంటి చిత్రాలను చూసి ఎక్కువగా చెడు మార్గంలో నడిచిన వారే ఎక్కువ.
ఇలా సెలబ్రిటీల అత్యుత్సాహం కారణంగా కికి చాలెంజ్‌లో పలువురు తీవ్రంగా గాయాలపాలవుతున్నారు. ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇలాంటివి వద్దని చెప్పాల్సిన సెలబ్రిటీలైన సినీ నటులు హీరో బెల్లకొండ సాయిశ్రీనివాస్, హీరోయిన్ కాజల్‌లు ఈ కికి చాలెంజ్‌లో పాల్గొన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వారు ఈ చాలెంజ్‌ని ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు లేని చోట్ల చేసినా మన యువత దానిని పట్టించుకోదు. తాము నడిరోడ్డులో ట్రాఫిక్ మద్య చేయాలని ఉబలాటపడే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా చూసుకుంటే సెలబ్రిటీలుగా పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్‌లది బాధ్యతారాహిత్యమనే చెప్పాలి. అయితే వారు వెళ్తున్న కారులో నుంచి దిగి చేయకుండా, వీల్ ఛైర్‌లో చేయడం కాస్త మెచ్చుకోవాల్సిన విషయం.