నాగార్జున కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ చిత్రాలలో విజయభాస్కర్-త్రివిక్రమ్‌ల మన్మథుడు ఒకటిగా నిలిచి పోతుంది. ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త కామెడీకి, ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఈ చిత్రం 2002లో అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లోనే అంటే నాగార్జుననే నిర్మించాడు. ఇక నాగ్ ఆ తర్వాత కాలంలో కాస్త వయసు పెరిగిన తర్వాత తనను ఇక మన్మథుడు, నవమన్మథుడు వంటి బిరుదులతో పిలవవద్దని, కావాలంటే కింగ్ అని పిలుచుకోమని చెప్పాడు. ఇక యువసామ్రాట్‌ని కూడా తన కుమారులకు వాడాలని పిలుపునిచ్చాడు. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే ఈ వయసులో నాగ్ మన్మథుడుకి సీక్వెల్ చేస్తాడని భావించలేం.
తాజాగా నాగార్జున తమ అన్నపూర్ణబేనర్‌లోనే మన్మథుడు2 అనే టైటిల్‌ని రిజిష్టర్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక నాగార్జున విషయానికి వస్తే ఇప్పుడు ఆయన తన పాత్రలు తన వయసుకు తగ్గట్లు ఉండేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన నేచురల్ స్టార్ నానితో కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బేనర్‌లో అశ్వనీదత్ నిర్మాతగా దేవదాస్ అనే మల్టీస్టారర్ చేస్తున్నాడు. దీని తర్వాత సోగ్గాడే చిన్నినాయనా దర్శకుడు కళ్యాణ్‌కృష్ణతో ఆ చిత్రంలోని బంగార్రాజు పాత్రకి ప్రీక్వెల్ తీయదలుచుకున్నాడు. సో.. మన్మథుడు2 అనే టైటిల్ వారి పిల్లలలో ఎవరికోసమో అయివుంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి.