బాలీవుడ్ ఖల్‌నాయక్ సంజయ్‌దత్ బయోపిక్‌గా 'సంజు' చిత్రం వచ్చి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేశం గర్వించదగ్గ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించగా రణబీర్‌కపూర్ సంజయ్‌దత్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అయినా కూడా దీనిపై విమర్శలు తప్పడం లేదు. ఇందులో సంజయ్‌దత్‌ని ఎంతో మంచి వాడిగా, ఏమి తెలియని వ్యక్తిగా చూపించాడనే విమర్శలు వస్తున్నాయి. ఏదైనా చిత్రం మంచి విజయం సాధిస్తే ఇలాంటి విమర్శలు, ఏదో చిన్న లోపాన్ని వెతికి విమర్శలు చేయడం మామూలే. కానీ దీనిపై రాజ్‌కుమార్ హిరాణి మాత్రం తీవ్రంగా స్పందించాడు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్‌ఎఫ్‌ఎం)లో పాల్గొనేందుకు మెల్‌బోర్న్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయంపై స్పందించాడు. ఈ విషయంపై నేను మాట్లాడటం మొదలుపెడితే.. రోజంతా మాట్లాడుతూనే ఉంటాను. సంజయ్‌దత్ ఇంట్లో ఆర్‌డిఎక్స్ దొరికిందని ఇప్పటికీ ప్రజలు నమ్ముతున్నారంటే ఓ మీడియాలో వచ్చిన తప్పుడు కథనమే కారణం. మేము ఆ తప్పుడు కథనాన్ని మాత్రమే సినిమాలో విమర్శించాం.
కానీ ఇప్పుడు కొందరు నేను 'సంజు' చిత్రంలో మీడియా మొత్తాన్ని టార్గెట్ చేశానని విమర్శలు చేస్తున్నారు. సంజయ్ వద్ద తుపాకీ ఉంది. దానిని యథాతథంగా మేము చూపించాం. అమ్మాయిలతో ఎఫైర్లు, డ్రగ్స్‌కి అలవాటు పడటం వంటివన్నీ చూపించాం. మరి మేమే సంజయ్‌ని మంచివాడుగా, సచ్చీలుడిగా చూపించామంటే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.