ఈ ఏడాది ఎన్నోచిత్రాలు లైన్‌లో ఉన్నప్పటికీ కొన్ని చిత్రాలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న డ్రీమ్ ప్రాజెక్ట్, తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా అమితాబ్‌బచ్చన్, నయనతార, విజయ్‌సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు ఇలా భారీ తారాగణంతో 'బాహుబలి'ని బీట్ చేయాలని చూస్తున్న 'సై..రా..నరసింహారెడ్డి', నందమూరి నటసింహం బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌గా క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న 'ఎన్టీఆర్' చిత్రాలు ఉన్నాయి. కానీ వీటన్నింటి కంటే తెలుగులో వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ప్రతిష్టాత్మక కాంబినేషన్‌లో రూపొందనున్న అసలు సిసలైన మల్టీస్టారర్ మూవీ ముందు వరుసలో ఉంటోంది.
'బాహుబలి-ది బిగినింగ్, బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రాల తర్వాత దేశ, విదేశాలలో గుర్తింపు తెచ్చుకున్న ఓటమి ఎరుగని రాజమౌళి దీనికి దర్శకత్వం వహిస్తుండటంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఆర్ ఫర్ రాజమౌళి, ఆర్ ఫర్ రామ్‌చరణ్, ఆర్ ఫర్ రామారావులు నటించనున్న ఈ చిత్రంపై రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. చిత్రానికి సంబంధించిన చిన్న వార్త బయటకు వచ్చినా కూడా అది వైరల్ అయిపోతోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో మహేష్‌బాబుని కూడా భాగంగా చేయాలని రాజమౌళి భావిస్తున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి మహేష్‌బాబు చేత వాయిస్‌ఓవర్ ఇప్పించాలని రాజమౌళి భావిస్తున్నాడట. త్వరలో మహేష్‌బాబు కూడా రాజమౌళి దర్శకత్వంలో కె.ఎల్.నారాయణ నిర్మాతగా దుర్గాఆర్ట్స్‌పై ఓ చిత్రం రూపొందించనున్న నేపధ్యంలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల చిత్రానికి మహేష్ వాయిస్‌ఓవర్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి మహేష్ వాయిస్‌ఓవర్ ఇస్తే మాత్రం ఈ ముగ్గురి హీరోల అభిమానులు థియేటర్లలో చేసే సందడి మామూలుగా ఉండదనే చెప్పాలి.