యుక్త వయసులోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ.. అమ్మాయి కనిపిస్తే, ఇక ఆమే జీవితం అనుకుని వెంటపడి పెళ్లి చేసుకుంటేనే ప్రేమ ఉన్నట్టు కాదు. ఆమె కాదన్నంత మాత్రాన జీవితాలనూ త్యాగం చేసేయాల్సిన అవసరం లేదు. జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలంటే ప్రతి దశనూ ఆస్వాదించాలి. గెలుపు, ఓటములను అర్థం చేసుకుని ముందుకు సాగాలి..అని అన్నారు వబ్బిన. వెంకటరావు. స్మైల్ పిక్చర్స్ పతాకంపై ఆయన నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమా మూడు పువ్వులు ఆరు కాయలు. డాక్టర్ మల్లె శ్రీనివాస్ సమర్పిస్తున్నారు. 40 సినిమాలకు పైగా సంభాషణల రచయితగా పనిచేసిన రామస్వామి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. 'అర్ధనారి' ఫేమ్ అర్జున్ యజత్, సౌమ్య వేణుగోపాల్, భరత్ బండారు, పావని, రామస్వామి, సీమా చౌదరి కీలక పాత్రధారులు.
దర్శకుడు మాట్లాడుతూ.. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఆద్యంతం నవ్వులు పువ్వులు పూయించే చిత్రమవుతుంది. అన్ని వర్గాల వారినీ మెప్పిస్తుంది.. అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ.. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. ఈ చిత్రంలో కడుపుబ్బా నవ్వించే హాస్య రసంతో పాటు, కంటతడి పెట్టించే కరుణరసం కూడా ఉంటుంది. దాదాపు నలభై చిత్రాలకు పైగా మాటల రచయితగా పని చేసిన రామస్వామి దర్శకునిగా చాలా చక్కగా చిత్రాన్నిహ్యాండిల్ చేశారు.. అని తెలిపారు.
నటీనటులు
పృథ్వి, తనికెళ్ల భరణి, కృష్ణ భగవాన్, అజయ్ ఘోష్, బాలాజీ, డాక్టర్ మల్లె శ్రీనివాస్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, రాకెట్ రాఘవ, అప్పారావు, రంగస్థలం మహేశ్, ఎఫ్ ఎం.బాబాయ్, ప్రమోదిని, జయలక్ష్మీ, గుమ్మడి జయవాణి, చంద్రరావు, ప్రభాకర్ రెడ్డి తదితరులు.
సాంకేతిక నిపుణులు
ఈ చిత్రానికి కెమెరా: యం.మోహన్‌చంద్, సంగీతం: కృష్ణ సాయి, ఎడిటింగ్: ఉపేంద్ర, ఆర్ట్: కె.వి.రమణ, పాటలు: చంద్రబోస్, భాస్కరభట్ల, ఫైట్స్: మార్షల్ రమణ, నిర్మాత: వబ్బిన. వెంకటరావు, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రామస్వామి.