ఈ ఏడాది 'జైసింహా, భాగమతి, తొలిప్రేమ' చిత్రాలు బాగానే ఆడాయి. ఇక వేసవిలో వచ్చిన 'భరత్ అనే నేను, రంగస్థలం, మహానటి' చిత్రాలు చరిత్ర సృష్టించాయి. ఆ తర్వాత తెలుగు పరిశ్రమకి చెప్పుకోదగ్గ హిట్ రాలేదు. కానీ కాస్త గ్యాప్ తర్వాత చిన్న చిత్రంగా వచ్చిన 'ఆర్‌ఎక్స్100' అనే బోల్డ్ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఇటీవల వచ్చిన 'గూఢచారి' సూపర్‌హిట్ దిశగా సాగుతుండగా, అప్పుడే వచ్చిన సుశాంత్-రాహుల్‌రవీంద్రన్‌ల 'చిలసౌ' చిత్రం సుశాంత్ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలుస్తోంది. ఇలా చూసుకుంటే ఈ ఏడాది ఇప్పటివరకు పెద్ద చిత్రాలతో పాటు చిన్న చిత్రాలు కూడా సరిసమానంగా విజయం సాధించి, లాభాలు తెచ్చిపెట్టాయి.
ఇక తాజాగా విడుదలైన దిల్‌రాజు-సతీష్-నితిన్-రాశిఖన్నాల 'శ్రీనివాసకళ్యాణం' కనీసం సరైన ఓపెనింగ్స్‌ని కూడా సాధించలేదు. ఈ చిత్రాన్ని అందరు ముక్తకంఠంతో ఫ్లాప్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆగష్టు15న గీతాఆర్ట్స్2 బేనర్‌లో పరుశురాం దర్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న 'గీతగోవిందం' చిత్రం విడుదల కానుంది. గీతాఆర్ట్స్ వారి చిత్రం కావడం, 'అర్జున్‌రెడ్డి'తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన విజయ్‌దేవరకొండ 'మహానటి'లో నటించినప్పటికీ ఫుల్‌ప్లెజ్డ్ హీరోగా వస్తున్న చిత్రం కావడం, కన్నడ సెన్సేషనల్ భామ, ఛలో బ్యూటీ రష్మికమండన్నలు ఇందులో గీత, గోవిందంలా కనిపించనున్నారు. గోపీసుందర్ అందించిన సంగీతానికి మంచి మార్కులే పడుతున్నాయి.
ముఖ్యంగా 'ఇంకేం.. ఇంకేం.. ఇంకేం కావాలే' పాట ఏకంగా 40మిలియన్ క్లిక్స్‌ని సాధించి దూసుకుని పోతోంది. ఇలా చూసుకుంటే 'గీతాగోవిందం' చిత్రం పెద్దగా పోటీ లేకుండా మంచి తేదీనే ప్రేక్షకుల ముందుకు వస్తోందని చెప్పాలి. మరి ఇప్పటికే యూత్ ఐకాన్‌గా మారిన విజయ్‌దేవరకొండ హీరోగా 'పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి'ల తర్వాత 'గీతాగోవిందం'తో హిట్ కొట్టి మరింతగా తన క్రేజ్‌ని పెంచుకుంటాడో లేదో వేచిచూడాల్సివుంది...!