వాస్తవానికి అక్కినేని ఫ్యామిలీలో అక్కినేని నాగేశ్వరరావు, తర్వాత అక్కినేని నాగార్జునలకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఇక ఎవ్వరికీ రానంత హైప్ నాగార్జున చిన్నకుమారుడైన అక్కినేని అఖిల్‌కి మొదటి చిత్రం విడుదలకు ముందే వచ్చింది. కానీ ఆ అంచనాలను ఆయన తన రెండు చిత్రాలతో నిరూపించుకోలేకపోయాడు. ఇక నాగార్జున పెద్దకుమారుడు నాగచైతన్య కెరీర్ కూడా దిల్‌రాజు 'జోష్' అనే ఫ్లాప్‌తోనే మొదలైంది. అయినా ఈయన స్లో అండ్ స్టడీ అనే మంత్రాన్ని పాటిస్తున్నారు. తన రెండో చిత్రంతోనే తన భార్య సమంత, గౌతమ్‌మీనన్‌లతో 'ఏ మాయచేశావే' చిత్రం చేసి హిట్ కొట్టాడు. ఇక తన తండ్రి నాగార్జున పరిచయం చేసిన దర్శకుడు, నాగ్‌కి 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి బ్లాక్‌బస్టర్‌ని అందించిన కళ్యాణ్‌కృష్ణతో చేసిన 'రారండోయ్‌వేడుక చూద్దాం' చిత్రం చైతు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈయన 'తడాఖా'లో యాక్షన్ హీరోగా, ప్రేమమ్‌లో లవర్‌బోయ్‌లా ఇలా అన్ని పాత్రలు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు.
ప్రస్తుతం ఆయన చందు మొండేటితో 'సవ్యసాచి', మారుతి దర్శకత్వంలో 'శైలజారెడ్డి అల్లుడు', 'నిన్నుకోరి' దర్శకుడు శివనిర్వాణ దర్శకత్వంలో పెళ్లయిన తర్వాత తన శ్రీమతి సమంతతో ఓ చిత్రం చేస్తున్నాడు. వీటిలో అన్నింటి కంటే ముందుగా 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం ఈనెల 31న విడుదల కానుంది. ఇందులో అత్తగా రమ్యకృష్ణ నటిస్తుండగా, చైతుకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలోని చివరి పాటను గోవాలో చిత్రీకరిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, అత్త అల్లుళ్ల బ్యాక్‌డ్రాప్‌లో ఇది రూపొందుతోంది. ఇందులో అత్తగా నటిస్తున్న రమ్యకృష్ణ పాత్ర హైలైట్‌గా ఉంటుందని సమాచారం. టీజర్, సాంగ్‌తోనే ఈ చిత్రంపై బజ్ ఏర్పడేలా యూనిట్ చేయగలిగింది.
మరి మారుతి అంటే మినిమం బడ్జెట్‌తో చిత్రాలు తీస్తాడు. అందుకే కాబోలు విదేశాలలో కాకుండా గోవాలో పాటను చిత్రీకరిస్తున్నాడు. 'భలే భలే మగాడివోయ్, మహానుభావుడు' తరహాలో మారుతి 'శైలజారెడ్డి అల్లుడు' ద్వారా చైతుకి మంచి హిట్‌ని అందించి 'యుద్దం శరణం' ఫ్లాప్‌ని మర్చిపోయేలా చేస్తాడేమో వేచిచూడాల్సివుంది...!