తెలుగు ప్రజలు సినీ ప్రియులు. నిజానికి మన దర్శకులు, కథా రచయితల కన్నా ఓ చిన్నపాయింట్‌ని తీసుకుని కథలను అల్లడంలో వీరి సృజనాత్మకత సామాన్యమైనది కాదు. వీరు నిజంగా దర్శకులు, రచయితలు కాకపోయినా తమ హీరోల చిత్రాలకు ఎలాంటి టైటిల్స్ ఉండాలి? అనే విషయం నుంచి ఫస్ట్‌లుకని, టైటిల్‌ని బట్టి కూడా కథలను ఊహిస్తుంటారు. చాలా సార్లు వారు చెప్పిందే నిజం కూడా అయింది. దానికి 'ఊపిరి, అజ్ఞాతవాసి' వంటివి తాజా ఉదాహరణలు.
ఇక విషయానికి వస్తే సూపర్‌స్టార్ మహేష్ బర్త్‌డే సందర్భంగా సోషల్‌మీడియా మొత్తం మారుమోగిపోయింది. ట్వీట్స్ విషెష్‌లతో ఆ రోజంతా మహేష్ ట్రెండ్ నడిచింది. దానికి తోడు మహేష్ 25వ ప్రతిష్టాత్మక చిత్రం టీజర్‌ని, టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇందులో మహేష్ కాస్త గడ్డంతో స్టైల్‌గా స్టూడెంట్ మాదిరిగా చేతిలో ఫైల్‌తో కనిపిస్తూ ఉన్నాడు. దీనిని బట్టి ఇందులో మహేష్ నిరుద్యోగి అని కొందరు ఊహిస్తున్నారు. ఇక మహేష్ ఓ అమ్మాయి వైపు చూడటం, అప్పుడు ఆ అమ్మాయి ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ని బట్టి ఇందులో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉన్నట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం 'మహర్షి' టీజర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ టైటిల్‌పై మహేష్ అభిమానులు పలు విధాలుగా పరిశోధన చేస్తున్నారు. ఇందులో మహేష్ పేరు రుషి అని తెలిసింది కాబట్టి హీరోయిన్ పేరు మహా అయి ఉంటుందని, అందుకే 'మహర్షి' అనే టైటిల్‌ని పెట్టారని అంటున్నారు.
ఇక సినిమా టైటిల్ పోస్టర్‌ని నిశితంగా పరిశీలిస్తే పైన గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి ఇళ్లు, కింద నగరాలలో ఉండే బిల్డింగ్‌లు, 'మహర్షి' టైటిల్‌లో 'షి' ఒత్తుని స్టాట్యూ ఆఫ్ లిబర్టీగా లోగోను డిజైన్ చేశారు. దీంతో ఈ చిత్రం పల్లెటూరు-అమెరికాకి చెందిన కథ అని కథను అల్లేస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ కూడా డెహ్రాడూన్‌లోని మంచుకొండలు, హైదరాబాద్, అమెరికాలలో తీయనున్నారు కాబట్టి కథ ఇదేనని పలువురు నమ్ముతున్నారు. కానీ ఈ విషయంలో వంశీపైడిపల్లి ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను, అభిమానులను ఆశ్యర్యపరుస్తాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.