ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలు, భారీ బడ్జెట్ చిత్రాల నుంచి మీడియం బడ్జెట్ చిత్రాల వరకు మొదట చెప్పిన డేట్‌కి విడుదల కావడం లేదు. బాగా జాప్యం జరుగుతూ ఉండటం, రీషూట్స్ వంటివి చేస్తుండటంతో ఏ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో తెలియక తమ సినిమాల డేట్స్‌ని ప్రకటించాలంటే మరే సినిమా పోటీకి వస్తుందో అనే భయంతో నిర్మాతలు ఉన్నారు. '2.ఓ, విశ్వరూపం 2' వంటి తమిళ చిత్రాలే కాదు.. తెలుగు చిత్రాల పరిస్థితి కూడా అలానే ఉంది.
ఇక విషయానికి వస్తే నాగచైతన్యతో 'ప్రేమమ్' వంటి హిట్ చిత్రాన్ని అందించిన చందుమొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' చిత్రం ముందుగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో నటించేందుకు భాషరాని చిత్రాలలో, తెలుగులో నటించనని చెప్పిన మాధవన్ కూడా ఈ కథపై ఉన్న నమ్మకంతో ఓకే చెప్పాడు. ఇక ఇది ఓ సైకలాజికల్ థ్రిల్లర్ అని, హీరోకి రెండు చేతులు సమానమైన బలం కలిగిన పాత్ర అని తెలియడంతో పాటు దీనిని ఓటమి ఎరుగని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండటం మరో ప్లస్ పాయింట్. కానీ మారుతి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రమే 'సవ్యసాచి' కంటే ముందుగా ఈనెల 31న విడుదల కానుంది. ఇందులో రమ్యకృష్ణ కూడా నటిస్తుండటం, సితార సంస్థ నిర్మిస్తుండటం, 'భలే భలే మగాడివోయ్, మహానుభావుడు' చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వం వహిస్తుండటం వల్ల ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
ఇక 'సవ్యసాచి' కంటే ముందే 'శైలజారెడ్డి అల్లుడు' విడుదల కానుండటంతో ఖచ్చితంగా 'సవ్యసాచి'కి గ్యాప్ అవసరం. పోనీ సెప్టెంబర్‌లో విడుదల చేయాలనుకుంటే నాగార్జున, నాని నటించిన 'దేవదాస్' విడుదల కానుంది. ఆ తర్వాత కొద్ది గ్యాప్‌లోనే విజయదశమి కానుకగా ఎన్టీఆర్ 'అరవింద సమేత వీరరాఘవ', రామ్ 'హలో గురు ప్రేమకోసమే'. విశాల్ 'పందెంకోడి 2 'లు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. దాంతో విధిలేని పరిస్థితుల్లో ఏ చిత్రం పోటీకి రాకుండా సోలో రిలీజ్ చూసుకునేందుకు నవంబర్‌కి 'సవ్యసాచి'ని పోస్ట్ పోన్ చేశారని తెలుస్తోంది.