గానగంధర్వుడు, అజరామరమైన పాటలకు ప్రాణం పోసి, సంగీత దర్శకునిగా కూడా తన సత్తా చాటుకున్న ఘంటసాల గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఉదయాన్నే మనశ్శాంతి కోసం వినే భగవద్గీత నుంచి ఎన్నో భక్తిపాటలతో పాటు సినీ పాటలతో అలరించిన ఆయన వంటి మధురగాయకుడు పుట్టడు...పుట్టబోడు. ఇక ఘంటసాల మరణం తర్వాత ఎన్టీఆర్, ఏయన్నార్‌లు తమ కుడిభుజం పోయినట్లు అయిందని అంటే అది అతిశయోక్తి మాత్రం కానేకాదు. అలా ఆయన ఆయా స్టార్స్‌కి మధురమైన గాత్రాన్ని అందించారు. తెలుగు ప్రజలకు ఆవకాయ, గోంగూర, వంకాయ వంటివి ఎంత కమ్మనైనవో ఘంటసాల పాటలు కూడా అంతే. ఆయన గురించి తెలియని తెలుగువాడెవ్వరూ ఉండరంటే అతిశయోక్తికాదు.
ఇక విషయానికి వస్తే ఘంటసాల గారి శ్రీమతి పేరు సావిత్రమ్మ. ఘంటసాల అర్ధాంగిగా ఆమె ఆయనతో సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఆమె ఘంటసాల బతికున్నప్పటి ఓ తమాషా సంఘటనను ఇలా చెప్పుకొచ్చింది. ఒకసారి మద్రాస్‌లో శ్రావణ మంగళవారం నోము నోచుకున్నాను. పూజ అయిపోయింది కదా...! ఇక మంగళహారతి పాడవే అని మా అమ్మమ్మ నాకు చెప్పింది. సరే అని చెప్పి నేను మంగళహారతి పాడుతున్నాను. ఘంటసాల గారు వచ్చి గుమ్మం బయటే నిల్చున్నారు. నేను అది గమనించలేదు.
ఆయన్ని చూసిన మా అమ్మమ్మ ఏరా బయటే నించున్నావు. లోపలికి వచ్చి హారతి తీసుకో అంది. దానికి ఘంటసాల గారు లేదమ్మా.. నేను తనని కొడుతున్నానేమో అని చుట్టుపక్కల వారు అనుకుంటారు. అందుకు బయటే నించున్నాను అని అన్నారు. అంటే నా పాట ఏడుస్తున్నట్లుగా ఉంది అన్న విషయం నాకు అర్ధమైంది. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఆయన ముందు నోరు తెరవలేదు.. అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.