యువ దర్శకులలో మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్లలో ఒకడిగా పరుశురాంకి మంచి పేరుంది. ఆయన నిఖిల్‌తో తీసిన 'యువత', రవితేజతో చేసిన 'ఆంజనేయులు', అల్లుశిరీష్‌తో గీతాఆర్ట్స్‌లో చేసిన 'శ్రీరస్తు..శుభమస్తు', నారా రోహిత్ 'సోలో', ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'గీతగోవిందం' వంటి చిత్రాలు తీశారు. ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో ఫ్లాప్ అంటే అది రవితేజతో తీసిన 'సారొచ్చారు' మాత్రమే. ఇక ఈయన గీతాఆర్ట్స్2 బేనర్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలతో తీసిన 'గీతగోవిందం' ఆగష్టు15న విడుదలకు సిద్దమవుతోంది. దీని తదుపరి సునీల్ హీరోగా ఆయన 'నాకేంటి' చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
ఇక ఈయన తన కెరీర్‌లో ఇప్పటికే గీతాఆర్ట్స్‌లో రెండు చిత్రాలు చేశాడు. తాజాగా 'గీతగోవిందం' ప్రమోషన్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ, అల్లుఅర్జున్‌తో ఖచ్చితంగా ఓ చిత్రం చేస్తాను. బన్నీవాసుతో నాకు మంచి సాన్నిత్యం ఉంది. నేను చేయాలనుకుంటున్న కథలను బన్నీవాసు ద్వారా అల్లుఅర్జున్‌కి వినిపిస్తూ ఉంటాను. నేను తయారు చేసుకునే కథ, కథనాల పట్ల అల్లుఅర్జున్ ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. అల్లుఅర్జున్‌తో చేయవచ్చు కదా? అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. అల్లుఅర్జున్‌కి తగ్గట్లుగా, ఆయన అభిమానులకు నచ్చే, మెచ్చే కథను తయారు చేసుకునే పనిలో ఉన్నాను. అందుకు కొంత సమయం పడుతుంది. అయితే బన్నీతో సినిమా మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ఇక అల్లుఅర్జున్ ఏనాడు లేని విధంగా 'నాపేరు సూర్య... నా ఇల్లు ఇండియా' తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. సాధారణంగా బన్నీ ఒక సినిమా చేస్తున్న సమయంలోనే మరో చిత్రం విషయంపై వార్తలు వస్తాయి. కానీ ఈ సారి మాత్రం ఎలాంటి వార్తలు రావడం లేదు. తాజా సమాచారం ప్రకారం అల్లుఅర్జున్ తన తదుపరి చిత్రాన్ని విక్రమ్ కె.కుమార్‌తో చేయనున్నాడని తెలుస్తోంది. దీని తర్వాత 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేసేందుకు బన్నీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.