నేటి ప్రతి స్టార్ హీరో బడ్జెట్ కోట్లతో రూపొందుతోంది. ఇక దాదాపు అరడజనుకు పైగా స్టార్ హీరోలు నేడు కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు. నేడు స్టార్స్ కోట్లలో పారితోషికం తీసుకోవడం వల్లనే బడ్జెట్ బాగా పెరిగిపోతోందని, సగం బడ్జెట్ హీరో రెమ్యూనరేషన్‌కే సరిపోతోందని కొందరు విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ కోట్లలో బడ్జెట్‌ని అనుగుణంగానే ఆయా స్టార్స్ క్రేజ్, ఇమేజ్ వంటివి ఉన్నాయి. సినిమా ఎలా ఉన్నా ఆయా హీరోల పుణ్యమా అని మొదటి వీకెండ్, వీక్‌లోనే అసలు బడ్జెట్‌ని నిర్మాతలు సొమ్ము చేసుకోగలుగుతున్నారు. ఇక సినిమా బాగానే ఉంది అని టాక్ వస్తే చాలు కోట్లాది రూపాయల లాభాలను కళ్లజూస్తున్నారు. ఇక ఈ హీరోల డామినేషన్, పారితోషికాలు అనేవి ఏనాటి నుంచో భారీగానే ఉన్నాయి. చిత్తూరు నాగయ్య, కన్నాంబ, ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీరంగారావు వంటి వారు నాడే భారీ పారితోషికాలు అందుకున్నారు.
ఇక ఆ తర్వాతి తరంలో కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి వారు కూడా లక్షల్లో రెమ్యూనరేషన్ అందుకునే వారు. నాడు బడ్జెట్ లక్షల్లోనే ఉండేది. దానికి తగ్గట్టే స్టార్స్ రెమ్యూనరేషన్ కూడా లక్షల్లో ఉండేది. నాటి పారితోషికాన్ని నాటి రూపాయి విలువతో పోలిస్తే నేటి స్టార్స్ తీసుకుంటున్నది కూడా రూపాయి విలువ రీత్యా దానికి సరిసమానమనే చెప్పాలి. ఇక నాడు నిర్మాతలు కూడా ఆయా స్టార్స్ వెంట సూట్‌కేసులు పట్టుకుని తిరిగేవారు. వారు ఓకే అంటే చాలు లక్షల్లో పారితోషికం ఇచ్చేవారు. దాదాపు 25-30ఏళ్ల కిందటే వీరు లక్షల్లో తీసుకునేవారు. దాంతో నాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏ స్టార్ కూడా రూ.10లక్షలకు మంచి పారితోషికం తీసుకోవడానికి వీలు లేదని, అలా తీసుకుంటే వారిని బహిష్కరించడంతో పాటు సహాయ నిరాకరణ కూడా చేస్తామన్నారు.
కానీ నాడే కోటీశ్వరుడుగా మారిన శోభన్‌బాబు మాత్రం దానిని బ్రేక్ చేశాడు. పది కాదు ఏకంగా 15లక్షలు ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. మరి రూ.10లక్షలే తీసుకోవాలని చెప్పడానికి మీరు ఎవరు? అంటూ ఆయన తన డిమాండ్‌ని బట్టి రెమ్యూనరేషన్ తీసుకుని నాటి మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ నిర్ణయాన్ని బ్రేక్ చేశాడు. మరి నాడు శోభన్‌బాబు చెన్నైలోనే అతి పెద్ద కోటీశ్వరుడు అంటే ఆయన ఎంత పారితోషికం తీసుకునే వారో ఈజీగానే అర్దమవుతోంది. అందువల్ల నేటి స్టార్స్ పారితోషికం గురించి ప్రత్యేకంగా విమర్శలు చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి.