ఎస్వీరంగారావు తర్వాత నవరస నటునిగా పేరు తెచ్చుకున్న నటుడు కైకాల సత్యనారాయణ. నాడు క్రూరమైన విలనిజాన్ని పండించాలన్నా, మాయల ఫకీర్ వేషాలు వేయాలన్నా, రుణరస పాత్రలలో జీవించాలన్నా ఎస్వీరంగారావు తర్వాత కైకాల సత్యనారాయణ పేరునే చెప్పుకోవాలి. ఇక విషయానికి వస్తే తాజాగా టాలీవుడ్ దిగ్గజ రచయితల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ కైకాల సత్యనారాయణ గురించి చెప్పుకొచ్చారు.
ఆయన మాట్లాడుతూ, మేము సినిమాలకు రాస్తున్న సమయంలో కైకాల సత్యనారాయణ గారితో ఇది కాదు ముగింపు, ముందడుగు వంటి చిత్రాలకు కలిసి పనిచేశాం. రామానాయుడు నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్స్‌లో కృష్ణ, శోభన్‌బాబు, శ్రీదేవి, జయసుధ వంటి వారు నటించిన మల్టీస్టారర్ ముందడుగు చిత్రంలో కైకాల గారి చేత హాస్య పాత్ర వేయించాం. ఎస్వీరంగారావు తర్వాత అంతటి నటుడిని కమెడియన్‌గా చూపించాం. ఇందులో శ్రీదేవిని ప్రేమిస్తే, కామెడీ చేస్తూ ఆయన కనిపిస్తారు. 'ఏంటయ్యా ఏమనుకుంటున్నారు. నాచేత ఇలాంటి పాత్రలు చేయిస్తున్నారు' అని మమ్మల్ని తిట్టేవారు. 'ఆ మాట రామానాయుడు గారికి చెప్పండి' అని మేం సమాధానం ఇచ్చేవారం. 'అమ్మో.. ఆయనకు చెప్పలేమండి బాబూ' అనేసేవారు. రామానాయుడుకి భయపడి ఆయన ఆ పాత్రను చేశారు. చాలా అద్భుతంగా అందులో కామెడీని పండించారు.
ఆ తర్వాత కూడా కైకాల సత్యనారాయణ గారి చేత 'బొబ్బిలిబ్రహ్మన్న, అగ్నిపర్వతం' వంటి చిత్రాలలో అలాంటి కామెడీ పాత్రలే చేయించాం. ఏంటి పరుచూరి వారూ.. ? అంటూ ఆయన మా మీద అరుస్తూ ఉండేవారు అని చెప్పుకొచ్చారు. ఇలా అన్ని రసాలను పోషించబట్టే సత్యనారాయణ నవరస నటుడుగా పేరు తెచ్చుకున్నాడు.