సినీ కథ, స్క్రీన్‌ప్లే రచయితగా ఉంటూ, రచయిత, కవిగా ఎంతో పేరు తెచ్చుకుని సినిమా రంగంతో అవినాభావ సంబంధం కలిగి, తర్వాత డీఎంకే పార్టీ తరపున ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ భీష్మపితామహుడు కలైంజర్ కరుణానిధి వృద్దాప్యం కారణంగా తుది శ్వాస విడిచారు. డీఎంకే పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా, ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, 60 సంవత్సరాల రాజకీయ జీవితంతో పాటు 70ఏళ్ల సినీ పరిశ్రమతో అనుబంధం ఆయనకు సొంతం. ద్రవిడుల, తమిళ నాడు ప్రజల ఆత్మగౌరవానికి కలైంజర్ కరుణానిధిని ప్రతీకగా చెప్పుకోవచ్చు. కొంతకాలంగా అనారోగ్యకారణాల వల్ల హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఈయన మరణం తమిళనాడు రాజకీయాలకు తీరనిలోటు.
ఆయన మరణం తమిళనాడును, సినిమా, రాజకీయ రంగాలను కూడా శోకసంద్రంలో ముంచెత్తింది. ఇక ఈయన అనారోగ్యంగా ఆసుపత్రిలో ఉండగానే రజనీకాంత్, కమల్‌హాసన్ వంటివారు ఆయనను కలిసి పరామర్శించారు. ఇక ఈయన కుమారుడు ఈయన వారసునిగా డీఎంకే అధ్యక్షుడు అయి, ముఖ్యమంత్రి పోటీలో ఉండటం ఖాయం. ఇక తమిళనాట ఇద్దరు దిగ్గజాలు, ఉప్పు నిప్పు అయిన జయలలిత, కరుణానిధిలు స్వల్ప వ్యవధిలో మరణించడం పెద్ద లోటేనని చెప్పాలి. ఎంజీఆర్, కరుణానిధిలపై మణిరత్నం తీసిన 'ఇద్దరు' చిత్రం చూసిన వారికి కరుణానిధి వ్యక్తిత్వం ఏమిటో బాగా అర్ధమవుతుంది....!