కోలీవుడ్‌లో దర్శకుడు విఘ్నేశ్ శివన్ గురించి అందరికీ తెలుసు. ఆయనకు ఎక్కువగా సినిమాల కంటే లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రియుడిగానే పేరు వచ్చింది. ఒక మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు. విఘ్నేశ్ శివన్ ఫేమ్ వెనక నయనతార ఉందని చెప్పడం అతిశయోక్తికాదు. వీరి మధ్య ప్రేమయాణం నడుస్తోన్న విషయం గురించి కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ కూడా కోడై కూస్తోంది. వీరి ప్రేమ స్వదేశంతో పాటు విదేశాలలో కూడా షికార్లు కొట్టి నిత్యం వార్తల్లో ఉంటూ ఉంది. ఇద్దరు రహస్యంగా ఒకే ఫ్లాట్‌లో సహజీవనం చేస్తున్నారని కూడా మీడియా అంటోంది. ఒకరి గురించి ఒకరు పొగుడుకోవడం... వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నిత్యం సెన్సేషన్ అవుతూనే ఉంది.
తాజాగా వీరు మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఫ్రెండ్ షిప్‌డే సందర్భంగా వీరు ఒకరినొకరు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలుపుకోవడమే కాదు.. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల ద్వారా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దర్శకుడు విఘ్నేశ్ శివన్ కూడా నయనతారకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ట్వీట్ చేశాడు. దానిలోని భావం అర్దం అవుతున్నట్లే ఉంది గానీ కాస్త లోతుగా, ఎంతో లోతుగా ఆ ట్వీట్ ఉంది. ఇది ప్రేమికుల రోజు కాదు.. వారు స్నేహితులు అంత కన్నా కాదు. మరి వీరు ఎందుకు శుభాకాంక్షలు తెలుపుకున్నారు... అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావచ్చు.
ఈ ట్వీట్‌లో విఘ్నేష్ శివన్ 'ఈ ప్రేమలో అపరిమితమైన స్నేహం ఉంది. స్నేహంలోనూ అపరితమితమైన ప్రేమ ఉంది'.. అని పేర్కొన్నాడు. ఈయన దర్శకుడు. పైగా రచయిత, ఇటీవలే పాటల రచయితగా కూడా మారాడు. ఇలా తనలోని రచయితను భాషా ప్రావీణ్యాన్ని తన ప్రేయసిపై ప్రదర్శించాడు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.