ఇండస్ట్రీలో కాస్టింగ్‌కౌచ్ ఉందని ఎందరో నటీమణులు చెబుతున్నారు. శ్రీరెడ్డి వంటివారు బయటకు కూడా వచ్చారు. కొందరు హీరోయిన్లు ఇలాంటివి ఉంటాయని చెబుతూనే తమకు మాత్రం ఇలాంటివి ఎదురుకాలేదని అంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం.. అన్ని రంగాలలో ఉన్నట్లే.. ఇంకా చెప్పాలంటే మిగిలిన రంగాలలో కంటే ఎక్కువగానే ఇండస్ట్రీలో కాస్టింగ్‌కౌచ్ ఉంది. వీటిని కొందరు ఏమి లేనట్లు నటిస్తున్నారు.
ఇక విషయానికి వస్తే దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా, 'మా పల్లెలో గోపాలుడు' నుంచి ఎన్నో తెలుగు, తమిళ చిత్రాలలో నటించిన యాక్షన్‌కింగ్ అర్జున్. ఈయన నటుడు, హీరో మాత్రమే కాదు విలన్ పాత్రలు, అన్నితరహా పాత్రలు, నిర్మాత, దర్శకుడు కూడా. కానీ ఇక్కడ ఒక్క విషయం ఏమిటంటే.. సినిమా ఇండస్ట్రీలో బయటి నుంచి వచ్చిన వారికి ఎదురయ్యే సమస్యలు, సవాళ్లు.. మంచి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చే వారికి, వారసురాళ్లకు పెద్దగా ఉండకపోవచ్చు. అయినా తాను కూడా వేధింపులు ఎదుర్కొన్నానని శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రకటించింది. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా కోలీవుడ్‌లో హీరోయినే అన్న సంగతి తెలిసిందే.
కాగా అర్జున్ మాట్లాడుతూ, కాస్టింగ్‌కౌచ్ ఇండస్ట్రీలో ఉంది. కాస్టింగ్ కౌచ్ ఉందని వస్తున్న వార్తలు నూటికి నూరు పాళ్లు నిజం. కానీ దానిని దృష్టిలో ఉంచుకుని నా కుమార్తె ఐశ్వర్యను ఇండస్ట్రీకి పంపకుండా ఉండలేను. ఎందుకంటే నా కూతురిపై నాకు నమ్మకం ఉంది. ఇండస్ట్రీలో ఆమె నెగ్గుకు రాగలదు. ఆ ఉద్దేశ్యంతోనే ఆమెకి సినిమా అవకాశాలు ఇప్పించాను. నేను ఇండస్ట్రీలో 38ఏళ్లుగా ఉంటున్నాను. అలాంటప్పుడు నేను కాకపోతే ఇండస్ట్రీని ఎవరు నమ్ముతారు? అని ప్రశ్నించాడు. యాక్షన్‌కింగ్ అర్జున్ చెప్పిన ప్రతి మాటా అక్షరసత్యం.