ఇళయరాజా తర్వాత ఆ స్థాయి ఆదరణ, ప్రేక్షకుల నుంచి అవార్డులు, రివార్డులు అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 25ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ 25ఏళ్లలో ఆయన ఎన్నో ఎత్తు పల్లాలు చవి చూశారు. ఆయన అందించిన మధురమైన పాటలకు మంత్రముగ్డులు కాని వారు ఉండరు. త్వరలో ఈయన 'హార్మోన్ విత్ ఎ ఆర్ రెహ్మాన్' అనే ఐదు ఎపిసోడ్ల సిరీస్‌కి హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సంద్భంగా రెహ్మాన్ దీని గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
గత ఐదేళ్లుగా నేను వైఎం మూవీస్ పేరుతో స్వంత నిర్మాణ సంస్థను ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నాను. ఈ నేపధ్యంలో నాకు హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం వచ్చింది. నాకు కాన్సెప్ట్ నచ్చడంతో ఒప్పుకున్నాను. ఈ సిరిస్ నా సంస్థ నుంచే రాబోతోంది. దేశవ్యాప్తంగా ఎంతో గొప్పవారైన సంగీత దర్శకులు, వారు పడిన కష్టాలను ఇందులో ప్రస్తావించబోతున్నాం. ప్రపంచంలో ప్రతి ఒక్కరు డబ్బులు వచ్చే పనిని ఎంచుకుంటారు. కానీ నేను వ్యాఖ్యాతగా వ్యవహరించబోయే షో కోసం కొందరు సంగీత విద్వాంసులను కలిశాను. వారి గురించి ఇప్పటి వరకు ఎవ్వరు విని ఉండరు. వాటిని చూసి కొందరైనా స్ఫూర్తి చెందుతారు.
ఇక నేను దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు. ఇప్పటికే నాకు తెల్లజుట్టు వస్తోందని మా అబ్బాయి ఎగతాళి చేస్తున్నాడు. (నవ్వుతూ) ఇంకా ఎక్కువ తెల్లజుట్టు రావాలని నేను అనుకోవడం లేదు. నేను వ్యాఖ్యాతగా చేస్తున్న సిరీస్ నాకు వరం వంటిది. ఇలాంటి అవకాశాలు మాకు ఎప్పుడో గానీ రావు. అందుకే దీనిని ఎంచుకున్నాను. నా నిర్మాణసంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను.. అని తెలిపాడు.