హన్సిక మొత్వాని.. ఈ ముంబై చిన్నది చైల్డ్ ఆర్టిస్టుగా పలు చిత్రాలలో నటించింది. ఆ తర్వాత టివి ఆర్టిస్ట్‌గా మారింది. ఇక తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ నటించిన 'దేశముదురు', ఎన్టీఆర్ 'కంత్రి', ప్రభాస్ 'బిల్లా' వంటి చిత్రాలలో నటించింది. కానీ ఈమె కోలీవుడ్‌లో మాత్రం స్టార్ స్టేటస్‌ని పొందింది. ఖుష్బూ, నమిత తర్వాత హన్సికకు కోలీవుడ్‌లో ఉన్న ఇమేజ్ సామాన్యం కాదు.
ఇక ఈమె బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లతో పాటు కన్నడలో కూడా పునీత్ రాజ్‌కుమార్ వంటి వారి సరసన చేరింది. ఈమె బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నా... విపరీతమైన ఫాలోయింగ్ మాత్రం కోలీవుడ్‌లోనే వచ్చింది. అక్కడ ఈమెను ముద్దుగా 'జూనియర్ ఖుష్బూ' అని పిలుస్తూ దేవాలయాలు కూడా కట్టారు. కాగా ఇప్పటివరకు ఈ భామ 49 చిత్రాలలో నటించింది. తెలుగులో మాత్రం స్టార్ స్టేటస్ సాధించకపోయినా.. పలు చిత్రాలలో నటిస్తోంది.
ఇక ఈమె తాజాగా తన 50వ చిత్రం గురించి మాట్లాడుతూ, 'నా అభిమానులందరికీ ఓ సర్‌ప్రైజ్ ఉంది. ఆగస్ట్ 9న నా బర్త్‌డే సందర్భంగా నా ల్యాండ్ మార్క్ మూవీ టైటిల్‌ని ప్రకటించనున్నాను' అని తెలిపింది. ఈమె ట్విట్టర్‌లో ఇది ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఆగష్టు 9న ఓ వైపు ప్రిన్స్ మహేష్‌బాబు, మరో వైపు బొద్దుగుమ్మ హన్సికల అభిమానులు ఇప్పటి నుంచే సందడి ప్రారంభించారు. ఇక నేటి రోజుల్లో హీరోయిన్లు 50 చిత్రాలను పూర్తి చేయడం అంటే అదో విశేషమనే చెప్పాలి. రెండు మూడు చిత్రాలకే తెరమరుగవుతున్న వారికంటే హన్సిక మొత్తానికి ఓ మంచి రికార్డుకి దగ్గరయిందని మాత్రం చెప్పవచ్చు.