త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న 'అరవింద సమేత' సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. దసరా టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ తండ్రిగా, గ్రామ సర్పంచ్ గా నాగబాబు నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే టైటిల్ రోల్ పోషిస్తుంది. ఇషా రెబ్బ సెకండ్ హీరోయిన్ గా ఈ సినిమాలో కనబడనుంది. హారిక హాసిని చినబాబు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ ఛాయలు ఈ సినిమా మీద ఏమాత్రం లేవు. అందుకే ఈ సినిమా బిజినెస్ వీరలెవల్లో జరుగుతున్నట్టుగా చెబుతున్నారు.
ఇకపోతే ఎన్టీఆర్ గత ఏడాది బుల్లితెర మీద బిగ్ బాస్ షో తో అటు కంటెస్టెంట్స్ ని ఇటు ప్రేక్షకులను బాగా మెప్పించాడు. బిగ్ బాస్ షో తో పది వారాల పాటు ఆ షోలో కంటెస్టెంట్స్ ని ప్రేక్షకులను తన వ్యాఖ్యానంతో అదరగొట్టాడు. అయితే బిగ్ బాస్ సీజన్ వన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కి వారు షో నుండి బయటికొచ్చాక ప్రేక్షకాదరణ బాగా దక్కింది. అలాగే వారు సెలబ్రిటీస్ హోదాని ఎంజాయ్ చేస్తున్నారు. హరితేజ వంటి వారు యాంకరింగ్ లో దూసుకుపోతుండగా... ఆదర్శ్ బాలకృష్ణ, ప్రిన్స్ లాంటి వారు తమ తమ కెరీర్ లో బిజీ అయ్యారు . అయితే ఎన్టీఆర్ బిగ్ బాస్ వన్ లో ఫైనల్స్ లోకి చేరిన ఆదర్శ్ బాలకృష్ణ కి తన 'అరవింద సమేత' సినిమాలో ఒక రోల్ ఇచ్చాడు.
అయితే బిగ్ బాస్ ఫైనల్ లో రన్నర్ తో సరిపెట్టుకోవాల్సి రావడంతో.. బాగా ఫీల్ అయిన ఆదర్శ్ బాలకృష్ణకి ఎన్టీఆర్ అప్పట్లో తన నెక్స్ట్ సినిమాలో ఆదర్శ్ కి మంచి రోల్ ఇస్తానని మాటిచ్చాడట. ఆ మాటిచ్చిన కారణంగానే అరవింద సమేతలో ఆదర్శ్ బాలకృష్ణకు అవకాశం ఇప్పించి తన మాటను ఎన్టీఆర్ నిలబెట్టుకున్నాడనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. ఇకపోతే తాను అరవింద సమేత షూటింగ్ లో జాయిన్ అయ్యానని.. ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ తో కలిసి ఫోటో దిగి దాన్ని ఆదర్శ్ బాలకృష్ణ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్, ఆదర్శ్ బాలకృష్ణ దిగిన ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.