ఎన్టీఆర్ చివరి రోజుల్లో లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నాడు. అది వారిద్దరి వ్యక్తిగత విషయమే అయినా లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ భార్యగా తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యం చెలాయించడం తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా నచ్చలేదు. ఇక ఎన్టీఆర్ అల్లుడైన చంద్రబాబు.. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారని ఎందరు ప్రచారం చేసినా కూడా ఎన్టీఆర్ వారసునిగా ప్రజలు, టిడిపి నాయకులు చంద్రబాబునే సమర్ధించారు. లక్ష్మీపార్వతి, బాలకృష్ణ, హరికృష్ణల కంటే చంద్రబాబు సారధ్యమే వారికి నచ్చింది. కాబట్టే మొదటి విడతలో 9 ఏళ్లు, ప్రస్తుతం రెండో విడతలో 5ఏళ్లు ఆయన చేతికి అధికారం అప్పగించారు. ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తప్ప మిగిలిన టిడిపి సానుభూతి పరులందరు చంద్రబాబుకే జై కొడుతున్నారు. మరి చంద్రబాబు తర్వాత లోకేష్ నాయకత్వాన్ని ప్రజలు, నాయకులు అంగీకరిస్తారా? లేదా? అనేది ఇప్పుడే చెప్పడం కష్టం.
ఇక లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్‌కి ప్రత్యామ్నాయంగా ఎవ్వరూ గుర్తించలేదు. దాంతో ఆమె రాజకీయ మనుగడ ఏమాత్రం సాధ్యం పడలేదు. ఇక విషయానికి వస్తే లక్ష్మీపార్వతి ప్రస్తుతం వైసీపీ గూటిలో ఉంది. ఇటీవల జగన్.. పవన్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగగా, జనసేన, వైసీపీ మద్య రచ్చమొదలైంది. పవన్ హుందాగా దానిపై పెద్దగా స్పందించకున్నా కూడా పవన్ అభిమానులు మాత్రం జగన్‌పై గుర్రుగా ఉన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పవన్ చీలిస్తే అది చంద్రబాబుకే లాభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ పవన్‌పైకి అస్త్రంగా లక్ష్మీపార్వతిని ప్రయోగిస్తోంది.
తాజాగా ఆమె మాట్లాడుతూ..నాలుగేళ్లుగా బిజెపి, పవన్‌లకి చంద్రబాబు అవినీతి కనిపించలేదు. ఇప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ డ్రామాలాడుతున్నారు. చంద్రబాబు అవినీతిలో పవన్, బిజెపిలకు వాటా లేదా అని ఆమె ఆవేశంగా ప్రశ్నిస్తోంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పవన్ చీల్చకుండా ఉండటానికే జగన్.. లక్ష్మీపార్వతిని అస్త్రంగా వాడుకుంటున్నాడని తెలుస్తోంది. అయినా లక్ష్మీపార్వతికి ప్రజల్లో గుడ్ విల్ ఉంటే కదా! ఆమె మాటలను ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదని, ఆమె మాటల ప్రభావం ఉండదనే చెప్పాలి.