హీరోలకు కావాల్సిన అందం, ఒడ్డుపొడవు, మంచి భాషా ఉచ్చరణ, స్పురద్రూపిగా కనిపించే వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ ఒకరు. ఈయన ఏ సినిమాలో కనిపించిన ప్రేక్షకులపై తనదైన ముద్ర వేస్తాడు. కుటుంబకథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలలోనే కాదు.. 'మగధీర' వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నాడు. ఇక 'బిగ్‌బాస్' సీజన్ 1 ద్వారా ఇంటిల్లిపాదిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఈయన తాజాగా మాట్లాడుతూ.. నేను చిరంజీవి గారితో 'ఠాగూర్, జై చిరంజీవా' చిత్రాలలో నటించాను. చిరంజీవి గారితో కలిసి నటించాలంటే నాకు వణుకు వచ్చేది. అయితే నేను అంతకుముందే కె.విశ్వనాథ్-కమల్‌హాసన్ వంటి గొప్పవారి కాంబినేషన్‌లో వచ్చిన 'శుభసంకల్పం'లో నటించాను. దాంతో కమల్ పక్కన కూడా చేశాను కదా.. చిరంజీవి గారంటే భయం ఎందుకు అని నాకు నేను సర్దిచెప్పుకునే వాడిని. నా పరిస్థితి గమనించిన చిరు గారు నాతో ఎప్పటినుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా ఎంతో క్లోజ్‌గా మూవ్ అయ్యేవారు.
అలా ఆయన ఫ్రెండ్లీగా లేకపోతే నేను ఖచ్చితంగా భయపడేవాడిని. ఓ సారి ఆయన నన్ను క్యారవాన్‌లోకి పిలిచి అరగంట సేపు మాట్లాడారు. నీ పేరేమో సమీర్ అని ఉంది.. కానీ నువ్వు తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నావ్... ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. అప్పుడు నేను మా ఫాదర్ ముస్లిం.. మా మదర్ బ్రాహ్మిణ్ అని అసలు విషయం చెప్పాను. ఈ విషయం విన్న చిరంజీవి గారు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు... అని చెప్పుకొచ్చారు.