తెలుగు రచయితల్లో అగ్రజులుగా పరుచూరి బ్రదర్స్ గురించి చెప్పవచ్చు. ఎన్నో ఏళ్లుగా వీరు తమ హవా చాటుతూ, ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా దాదాపు మూడు తరాలకు పనిచేస్తూ ఉన్నారు. పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ తాజాగా త్రివిక్రమ్, పవన్‌కళ్యాణ్‌ల కాంబినేషన్‌లో రూపొందిన 'అజ్ఞాతవాసి' చిత్రం ఎందుకు డిజాస్టర్‌గా మారిందో చక్కగా వివరించారు.
ఆయన మాట్లాడుతూ..'అజ్ఞాతవాసి' పూర్తి వినోదాత్మక చిత్రం. త్రివిక్రమ్, పవన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఇది. అంతకు ముందు వారు 'అత్తారింటికి దారేది' వంటి బ్లాక్‌బస్టర్‌ని అందించి ఉన్నారు. దాంతో ఎన్నో అంచనాలతో థియేటర్‌కి వచ్చినా ప్రేక్షకులు 'అజ్ఞాతవాసి' చూసి నిరుత్సాహపడ్డారు. ఈ సినిమా చూడగానే నాడు వెంకటేష్‌కి మేము రాసిన 'రక్తతిలకం' చిత్రం గుర్తుకు వచ్చింది. ఆ సినిమా కోసం మేము చేసిన మార్పునే త్రివిక్రమ్ చేసి ఉంటే బాగుండేదని అనిపించింది. త్రివిక్రమ్ ఎలాగైతే 'అజ్ఞాతవాసి'కి ఆర్డర్ రాసుకున్నారో.. మేము కూడా 'రక్తతిలకం' కోసం అలాంటి అర్డర్‌లోనే రాసుకున్నాం. అప్పుడు రామానాయుడు గారు 'ఇదేంటయ్యా.. తల్లి మంచంలో ఉంటే హీరో డ్యూయెట్లు ఎలా పాడుకుంటాడు? నాకు నచ్చలేదు.. మార్చేయండి' అని చెప్పారు.
అలాంటి ఆలోచన 'అజ్ఞాతవాసి' విషయంలో త్రివిక్రమ్‌కి ఎవరు సలహా ఇచ్చినట్లు లేరు. తండ్రి పాత్ర, సోదరుడి పాత్ర హత్యకు గురవుతాయి. అప్పుడు పగతీర్చుకోవడానికి వెళ్లిన హీరో ఆ హంతకులను లేపేస్తాడని అందరు భావిస్తారు. కానీ హీరో అది చేయకుండా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి కామెడీ చేస్తుంటాడు. ప్రేక్షకులు నిరాశగా వెనుదిరగడానికి నాకు తెలిసిన కారణం ఇదే.. అంటూ తన అనుభవంతో పాఠం చెప్పారు పరుచూరి గోపాలకృష్ణ.