తన సినిమాల ద్వారానే కాదు.. తనదైన వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా కూడా లోకనాయకుడు కమల్‌హాసన్ నిత్యం వార్తల్లో ఉంటాడు. ఆమద్య మహాభారతం, రామాయణం, భగవద్గీతతో పాటు కులం, బ్రాహ్మణవాదం, జంధ్యం గురించి ఏవేవో విపరీతమైన వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈయన ఓ సారి తమిళనాడు కాంగ్రెస్ నాయకుడు చిదంబరంను ఉద్దేశించి ఓ తమిళ వ్యక్తి అందునా తెల్ల చొక్కా, పంచె కట్టుకునే వ్యక్తి ఏదో ఒకనాడు ఈ దేశాన్ని పాలిస్తాడని వ్యాఖ్యలు చేసి నాడే ప్రధాని పీఠంపై కన్నేసిన జయలలితకు బద్దశత్రువుగా మారాడు. దాంతో విశ్వరూపం చిత్రం విడుదల సందర్భంగా కొందరి మనోభావాలు దెబ్బతింటాయని, ఓ మతాన్ని తప్పుగా చూపించారనే ఉద్దేశ్యంతో విశ్వరూపంని తమిళనాడులో విడుదల కాకుండా జయలలిత అడ్డుకుంది. దాంతో ఆయన తప్పని పరిస్థితుల్లో మొదట తెలుగులో విడుదల చేసుకున్నాడు.
ఇక త్వరలో ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన విశ్వరూపం2 చిత్రం ఆగష్టు10న దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో భారీగా విడుదల కానుంది. మరోవైపు రాజకీయ ఎంట్రీ కూడా ఇచ్చిన కమల్ తాజాగా బిగ్‌బాస్ సీజన్2ని హోస్ట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన అమ్మ జయలలితపై ఉన్న కోపాన్ని బహిరంగంగానే ఎక్స్‌ప్రెస్ చేశాడు. బిగ్‌బాస్ పార్టిసిపెంట్ అయిన ఐశ్వర్య మాట్లాడుతూ, జయలలిత డిక్టేటర్‌గా మారి రాష్ట్రాన్ని పాలించిందని హౌస్‌లోనే తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలకు హోస్ట్ కమల్‌హాసన్ కూడా మద్దతు ఇచ్చాడు. ఆయన జయలలితను ఉద్దేశ్యపూర్వకంగా కించపరిచేలా మాట్లాడాడని పోలీస్ కేసు నమోదైంది. దాంతో మద్రాస్ హైకోర్టు అడ్వకేట్ లౌసీర్ రమేష్ గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్‌కి కమల్‌పై ఫిర్యాదు చేశాడు.
కమల్ తన రాజకీయ అవసరాల కోసం అమ్మ జయలలితను కించపరుస్తూ మాట్లాడేందుకు బిగ్‌బాస్ షోని వేదికగా చేసుకున్నాడని ఆయన ఆరోపించి, తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ తమిళనాడు సీఎం, దివంగత జయలలితను కించపరిచేలా మాట్లాడినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ న్యాయవాది కోరారు. జయపై కమల్ వివాదాస్పదంగా మాట్లాడిన మాటల ఎపిసోడ్ రేపు టివిలో ప్రసారం కానుంది. మరి 'విశ్వరూపం2' విడుదల సమయంలో మరోసారి కమల్ ఇబ్బందుల్లో పడ్డాడనే చెప్పవచ్చు.