ప్రస్తుతం తెలుగులో విలక్షణ పాత్రలు చేస్తున్న నటుల్లో అజయ్‌ఘోష్ ఒకరు. ఈయన ఆహార్యం, గాంభీర్యం, రూపురేఖలు, గంభీరమైన వాయిస్, ఆయన గుండు.. ఇలా ఆయన్ని చూస్తే చిన్నపిల్లలు కూడా భయపడే విలన్‌లాగా ఉంటాడు. దాంతో ఆయనకు సినిమాలలో కూడా అలాంటి పాత్రలే వస్తూ ఉన్నాయి. అలాగని ఆయన కేవలం ఈ తరహా పాత్రలను మాత్రమే కాదు.... విభిన్నమైన పాత్రలు ఏవి వచ్చినా వదులుకోకుండా తన నటనా ప్రతిభను చాటుకుంటూ ఉన్నాడు. ఈయన తాజాగా మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు.
నేను 'బాహుబలి' చిత్రంలో నటించాను. ఆ విషయం గొప్పగా కొంత మందికి చెప్పాను. వాళ్ల ద్వారా ఆ విషయం చాలా మందికి తెలిసింది. ఆ చిత్రంలో నేను నటించిన సీన్స్‌ని నిడివి ఎక్కువగా ఉన్న కారణంగా తీసివేశారు. దానికి నేనేమీ ఫీల్ కాలేదు. కానీ అందరు 'బాహుబలి' చేశానని చెప్పావు కదా..! ఎక్కడా కనిపించలేదే? అని అడగటం మొదలుపెట్టారు. ఆ సీన్స్ ఎడిటింగ్‌లో తీసి వేయాల్సివచ్చింది అని అందరికీ సమాధానం చెబుతూ రావాల్సివచ్చింది. 'అబ్బా.. భలే చాన్స్ పోయిందే' అంటూ వారు బాధతో అనేవారు. దాంతో నేను బాగా ఫీలవ్వాల్సివచ్చింది. నిడివి ఎక్కువైతే ఎవో కొన్ని సీన్స్‌ని ఎడిట్ చేస్తారన్న విషయం వారందరికీ తెలియదు కదా...! అని చెప్పుకొచ్చాడు.
దీనిని వింటే ఓ సామెత జ్ఞాపకం వస్తుంది. అత్త తిట్టిందని కాదు.. తోడికోడలు నవ్విందనే బాధలా ఉంది అజయ్‌ఘోష్ ఆవేదన. బాహుబలిలో సీన్స్ తీసి వేయడం కంటే ఇతరులు అడిగిన ప్రశ్నలు, వారు చూపించిన సానుభూతే ఆయన్ను బాగా బాధించాయని అర్దమవుతోంది.