పుట్టిన మనిషి గిట్టకు మానడు. గిట్టిన మనిషి మరలా పుట్టక మానడు అని భగవద్గీత చెబుతోంది. జన్మించిన ప్రతి ఒక్కరు మరణించడం ఖాయమే అయినా మనం నిత్యం చిరంజీవులుగా మిగిలి ఉంటామనే భ్రమలో ఉంటాం. మరోవైపు మరణం సహజమే అయినా ఆ మరణం ఎప్పుడు, ఏమిటి? అనేవి తెలిస్తే మాత్రం ఏ వ్యక్తి అయినా నిజంగా నరకం అనుభవిస్తాడు. మనిషికి మరణం ఎప్పుడో తెలియనప్పుడే సంతోషంగా ఉంటాడు.
ఇక విషయానికి వస్తే విలక్షణ నటుడు, బాలీవుడ్, హాలీవుడ్‌లలో కూడా పలు చిత్రాలలో నటించిన దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా ఇర్ఫాన్‌ఖాన్‌ని చెప్పుకోవాలి. ఈయన ప్రస్తుతం న్యూరో ఎండ్రోక్రిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన లండన్‌లో చికిత్స పొందుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఇర్ఫాన్‌ఖాన్ మాట్లాడుతూ నేను బతికి ఉండేది మరో కొన్ని నెలలు మాత్రమేనంటూ ఆవేదనాభరితంగా చెప్పుకొచ్చారు. నేను బతికుండేడి కొన్నినెలలు, లేదా ఏడాది, మహా అయితే రెండేళ్లు బతుకుతానేమో. ఈ విషయాన్ని నా మెదడు నాకు నిత్యం చెబుతూనే ఉంది. ఇది నిరుత్సాహంగా, బాధగా, తట్టుకోలేని విషయమే అయినా సరే ఇకపై ఇలాంటి విషాదపు మాటలు మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను.
నాకు మిగిలి ఉన్న జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. ప్రస్తుతం నాకు కీమోథెరపి నాలుగు సైకిల్స్ పూర్తయ్యాయి. ఇంకా రెండు సైకిల్స్ పూర్తి కావాల్సి ఉంది. నాకు మొత్తం ఆరు సైకిల్స్ పూర్తి అయిన తర్వాత స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నా జీవితం ఎంత కాలమో తెలుస్తుంది.. అని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. నిజంగా ఈ పరిస్థితి పగవారికి కూడా రాకూడదని కోరుకోవాలి.