తెలుగులో ఇప్పుడున్న యంగ్ హీరోలలో నాగశౌర్య ఒకరు. 'ఊహలు గుసగుసలాడే' నుంచి 'ఛలో'వరకు ఆయన పలు చిత్రాలలో నటించాడు. ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇక 'ఛలో' చిత్రం ఆయన కెరీర్‌లోనే మరిచిపోలేని చిత్రమని చెప్పాలి. వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య సొంతగా నిర్మించిన ఈ చిత్రం ఆయనకు కెరీర్ పరంగా, నిర్మాత పరంగా కూడా మంచి పేరును తెచ్చిపెట్టింది. నిజానికి నేడున్న యంగ్ హీరోలలో లవర్‌బోయ్ ఇమేజ్‌కి ఈయన బాగా సూట్ అవుతాడనే అభిప్రాయం ఉంది.
'ఛలో' ఇచ్చిన ఆత్మస్తైర్యంతో ఆయన ప్రస్తుతం తానే నిర్మాతగా రెండో చిత్రం దాదాపు పూర్తి చేశాడు. 'ఛలో' ద్వారా కొత్త దర్శకుడైన వెంకీ కుడుముల టాలెంట్‌ని నమ్మిన ఆయన ఈసారి కూడా మరో కొత్త దర్శకునిపై నమ్మకంతో దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. శ్రీనివాస చక్రవర్తి అనే కొత్త దర్శకుడు తీసిన ఈ చిత్రం పేరు 'నర్తనశాల'. నాటి పౌరాణిక చిత్రం 'నర్తనశాల' టైటిల్‌తో వచ్చిన ఈ మూవీపై నాగశౌర్య ఎంతో ధీమాగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా ఇందులోని ఓ పూర్తి పాటను వీడియో సాంగ్‌గా విడుదల చేశారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ పాటకు సాహిత్యాన్ని భాస్కరభట్ల రవికుమార్ అందించగా, హీరోహీరోయిన్ల మధ్య బ్యాగ్రౌండ్‌లో వచ్చే సాంగ్ ఇది. ఈ సాంగ్‌ని సంగీత దర్శకుడు మహతితో పాటు సమీరా భరద్వాజ్ ఆలపించారు. 'ఎగిరేనెమనసు' అని మెలోడీగా సాగిన ఈ పాట జస్ట్ ఓకే అనిపించేలా ఉంది.
ఇక దీని తర్వాత నాగశౌర్య ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం 'ఆయనకిద్దరు' తరహా చిత్రంలో ఇద్దరు యువతుల మధ్య నలిగిపోయే యువకుని పాత్రను పోషిస్తున్నాడు. ఈయన మరింతగా ఎదగాలంటే మరెంతో కష్టంతో పాటు పాటలు, కథ, కథనాలు వంటివన్నీ బాగా ఉండేలా చూసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.