ఇటీవల తాప్సి మాట్లాడుతూ, భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలిరాజ్ పాత్రను తాను పోషించాలని ఎన్నో కలలు కంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇలా ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్‌లు, డ్రీమ్ రోల్స్ ఉంటాయి. ఇక విషయానికి వస్తే ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్లు అయినా ఇప్పటికీ తన హవా చాటుతూ, తనదైన ఫిజిక్‌తో మాయచేస్తున్న బ్యూటి చెన్నై చిన్నది త్రిష. ఈమె తెలుగు, తమిళ భాషల్లో సీనియర్ స్టార్స్ నుంచి యంగ్‌స్టార్స్ వరకు అందరితో నటించి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలలో భాగమైంది. ఇక ఈమె ఎప్పటినుంచో తనకి ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశం రాలేదని, అది వస్తే తన జీవితం ధన్యమైనట్లు భావిస్తానని చెప్పింది.
తాజాగా ఆమె మరో కోరికను, మరో డ్రీమ్ పాత్రను చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఈమె తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ 'మోహిని' చిత్రం విడుదలైంది. ప్రస్తుతం ఆమె 'చతురంగ వెట్టై', 1818, 96, పరమపదం, విళయాడు' వంటి చిత్రాలలో యాక్ట్ చేస్తోంది. ఇక సామి2 నుంచి ఈమె పలుకారణాల వల్ల బయటికి వచ్చేసింది.
ఈమె తాజాగా మాట్లాడుతూ.. 'కోడి' చిత్రంలో రాజకీయనాయకురాలి పాత్రను పోషించాను. ఈ చిత్రం నాకు ధనుష్‌కి తెచ్చినంత గుర్తింపును తీసుకుని వచ్చింది. అమ్మ జయలలిత పాత్రను పోషించాలనేది నా కోరిక. జయలలిత జీవితం ఆధారంగా ఎవరైనా చిత్రం తీస్తే అందులో నటించడానికి నేనుసిద్దంగా ఉన్నాను. అమ్మ పాత్రను పోషించాలని ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను. ఈ విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నాను. నాకు నచ్చిన గొప్పనేత జయలలిత. ఆమె లేని లోటును ఎవ్వరూ పూరించలేరు అని చెప్పుకొచ్చింది.
ఇక జయలలిత జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందనుందని అందులో అమ్మ పాత్రను రమ్యకృష్ణ పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంలో రమ్యకృష్ణ క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల 'మహానటి'లో సావిత్రి పాత్రను పోషించిన కీర్తిసురేష్ జయలలితగా నటిస్తోందని వార్తలు వస్తే వాటిని కీర్తిసురేష్ ఖండించిన సంగతి తెలిసిందే.