ఏపీలో ఉన్నంత కుల రాజకీయాలు ఎక్కడా ఉండవనే చెప్పాలి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాలలో కాపు సామాజికవర్గం ఓట్లు కీలకంగా మారుతున్నాయి. నిన్నటి వరకు ముద్రగడ పద్మనాభం వల్ల, పవన్‌కళ్యాణ్, కన్నాలక్ష్మీనారాయణ వంటి వారి వల్ల కాపుల ఓట్లు చీలిపోతాయని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ హఠాత్తుగా కాపులు ఉద్యమిస్తున్న బిసీ రిజర్వేషన్ల పరిధిలోకి కాపులను తెచ్చే అంశం తనది కాదని, అది కేంద్రం పరిధిలోనిదని కాపులకు గట్టి పట్టున్న జిల్లాలోనే వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం పెద్ద దుమారాన్నే లేపింది. దీనిపై జగన్‌పై తీవ్ర స్థాయిలో ముద్రగడ విమర్శించారు. కాపులకు ఏమైనా చేయగలిగితే అది చంద్రబాబు వల్లే సాధ్యమని తెలిపాడు. ఇక ఈ పరిణామం టిడిపికి బాగానే అనుకూలంగా మారుతోంది. ఇప్పటికే జగన్, పవన్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంపై కాపులు మండిపడుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో పవన్ కాపులను ఎంత వరకు ఓట్ బ్యాంకుగా మార్చుకుంటాడు? చంద్రబాబు పైఎత్తు ఏమిటి? అనేది ఆసక్తికర విషయం.
ఇక పవన్ విషయంలో కూడా తమ విమర్శలకు మరింత పదును పెట్టాలని టిడిపి నాయకులకు చంద్రబాబు, లోకేష్‌లు సూచించారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే అన్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని, పవన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. పవన్‌కి అసలు రైతుల సమస్యలపై కనీస అవగాహన లేదు. రైతుల కోసం శ్రమిస్తున్న చంద్రబాబుని పవన్ లక్ష్యంగా చేసుకోవడం మానాలి. పవన్ నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తే, 40రోజులు హైదరాబాద్‌లో కనిపిస్తాడు. పవన్ చంద్రబాబును కాకుండా ఏపీని మోసం చేసిన ప్రధాని మోడీని టార్గెట్ చేస్తే అందరు సంతోషిస్తారు. పవన్ కళ్యాణ్ నాదృష్టిలో సీరియస్ రాజకీయ నాయకుడు కాదు. ఆయన మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
చంద్రబాబుని లక్ష్యంగా చేసుకుని బిజెపి పన్నిన వ్యూహంలో కేసీఆర్, గవర్నర్ నరసింహన్‌లు భాగస్వాములుగా మారారు. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని పదే పదే చెబుతున్న బిజెపి ఇప్పుడు జోన్ ఇవ్వలేమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం దారుణమని విమర్శించారు. ఇక కేశినేని నాని విషయానికి వస్తే నిజానికి పవన్ సహాయం తీసుకునేందుకు చంద్రబాబు కూడా విజయవాడ ఎంపీ సీటును పివిఆర్‌కి ఇచ్చేవాడే. కానీ చంద్రబాబు రిక్వెస్ట్‌ను విని పవన్ పట్టుబట్టకపోవడం వల్లే కేశినేని నానికి కనీసం సీటు వచ్చి విజయం సాధించాడు అని పవన్ అభిమానులు నానిపై మండిపడుతున్నారు.