గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్ సినిమాల వరకు గత పదేళ్లుగా హీరోగా ఫామ్ లో లేని నితిన్ ఒక్కసారిగా ఫామ్ లోకొచ్చేశాడు. మంచి కథలను పట్టడమే కాదు.. నితిన్ లక్కు కూడా కలిసొచ్చింది. అయితే తన లక్కుకి తోడు తన దేవుడి ఆశీర్వాదం కూడా ఉందని.. అందుకే తన దేవుడు సినిమాల్లోని కొన్ని సీన్స్ ని తన సినిమాల్లో కాపీ చేస్తానని... ఇక తన దేవుడు తన సినిమా ఫంక్టన్స్ కి హాజరైతే సినిమాలు హిట్ అవుతాయని.. ఇలా తన దేవుడు గురించి రకరకాలుగా చెప్పేవాడు. మరి నితిన్ దేవుడు ఏ శ్రీనివాసుడో, ఏ ఆంజనేయస్వామో కాదు... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే నితిన్ కి భక్తి, గౌరవం. ఇక ఎక్కడికి.. వెళ్లినా పవన్ కళ్యాణ్ కూడా నితిన్ కోసం వస్తాడు.
మరి ఇష్క్ దగ్గరనుండి పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తీసుకుంటున్న నితిన్ ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం సినిమా మీద ఉన్న గట్టి నమ్మకంతో తన దేవుడి దర్శనానికి వెళ్లడం లేదా.. లేదా విడుదలకు ఇంకా టైం ఉంది.. ఈలోపు చూసుకుందాం అనుకుంటున్నాడా. ఏమో గాని ప్రస్తుతం నితిన్ - రాశి ఖన్నా ల జంటగా దిల్ రాజు నిర్మాతగా.. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం 'శ్రీనివాస కళ్యాణం' సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. భారీ క్రేజ్ మధ్యన ఆగష్టు తొమ్మిదన విడుదలవుతున్న ఈ సినిమాకి దిల్ రాజు స్పెషల్ ప్రమోషన్స్ మరింత ఎట్రాక్షన్ కానున్నాయి.
అందుకే శ్రీనివాస కళ్యాణ్ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్న నితిన్ ఇప్పుడు తన దేవుణ్ణి విస్మరించాడనే టాక్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. లేకపోతే తన సినిమా ఆడియో వేడుకకు పవన్ ని పిలిచేవాడు అంటున్నారు. మరి నితిన్ ఊహ ఎలా వుందో. శ్రీనివాస కళ్యాణం ప్రీ రిలీజ్ ఈవెంట్ కేమన్నా పవన్ ని ఆహ్వానిస్తాడేమో చూడాలి. అసలే రాజకీయాలతో బాగా బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఈసారి నితిన్ కి టైం ఇస్తాడో లేదో. అయినా భక్తుడి కోరికను దేవుడు నెరవేర్చుతాడులే. ఇంతకూ ముందే తానూ వస్తే సినిమాలు హిట్ అవుతాయంటే తాను తప్పక వస్తానని పవన్ కళ్యాణ్ ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చాడు.