కొన్ని కథలను రచయితలు, దర్శకుల ఒక హీరో కోసం రాసుకుంటే వాటిని ఆయా హీరోలు వద్దనుకుంటే వేరే హీరోల వద్దకు వెళ్తూ ఉంటాయి. కానీ తాము నిరాకరించిన చిత్రం బ్లాక్‌బస్టర్ కావడం, ఒప్పుకున్న కథ డిజాస్టర్ కావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక విషయానికి వస్తే తెలుగులో దాదాపు మూడు తరాల స్టార్స్‌కి ఎన్నో బ్లాక్‌బస్టర్స్ అందించి, వారి ఎదుగుదలలో సహకరించిన ఎవర్‌గ్రీన్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్. హీరోయిజాన్ని పీక్ స్టేజీలో చూపించేలా కథలు, సంభాషణలు రాయడంలో వీరు సిద్దహస్తులు.
పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఓ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన అంశం ఏమిటంటే.. బాలయ్య ఎన్నుకున్న 'పల్నాటి బ్రహ్మనాయుడు', వదిలేసిన 'సింహాద్రి' తెరవెనుక కథ. పరుచూరి మాట్లాడుతూ, మొదట విజయేంద్రప్రసాద్ గారు బాలకృష్ణ కోసం బి.గోపాల్‌కి 'సింహాద్రి' కథను ఇచ్చారు. దానికి నేను సంభాషణలు రాయడం కూడా ప్రారంభించాను. కానీ అంతలో బి.గోపాల్ వచ్చి నిర్మాత మేడికొండ మురళీకృష్ణకి 'పల్నాటి బ్రహ్మనాయుడు' అనే కథ నచ్చింది. ఆ కథ బాలయ్యకి కూడా నచ్చడంతో ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు అని చెప్పుకొచ్చారు.
అలా బాలయ్య చేయాల్సిన 'సింహాద్రి' చిత్రం ఆయన చేయలేకపోయి 'పల్నాటి బ్రహ్మనాయుడు' చేశారు. 'సింహాద్రి'ని రాజమౌళి-ఎన్టీఆర్‌లు చేశారు అని చెప్పుకొచ్చారు. ఇక 'పల్నాటి బ్రహ్మనాయుడు' కోసం ఎన్నో కథలు విని, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ వంటి పరిశ్రమ రచయితల వద్ద కథలు విని, చివరకు పోసాని కృష్ణమురళి కథను ఓకే చేశారు. ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నమోదైంది.