మెగా డాటర్ కి మెగా అనే పదమే శాపం అయ్యిందనిపిస్తుంది. మెగా హీరోలకు మెగా అనే పదం ఒక బ్రాండ్. కానీ నిహారికకు మాత్రం మెగా అనే పదం శాపంలానే ఉంది వ్యవహారం చూస్తుంటే. ఎందుకంటే హీరోయిన్స్ అంటే సినిమాల్లో ఎంతో కొంత గ్లామర్ షో చేయాలి. అలాగే హీరోలతో మంచి రొమాంటిక్ సీన్స్ లో కలుపుగోలుగా నటించాలి. కానీ నిహారికకు అవకాశం ఇవ్వాలంటేనే జంకే దర్శకనిర్మాతలు ఆమె కోసం గ్లామర్ పాత్రలు రాయడానికి కూడా సాహసించరు. మరి హీరోయిన్ గా నాగశౌర్య తో కలిసి ఒక మనసు సినిమాలో చక్కటి ట్రెడిషనల్ డ్రెస్సులతో... అందమైన చీర కట్టులో కనిపించినప్పటికీ... ఆ సినిమా సో సో గానే ఆడింది. నాగశౌర్య తో రొమాంటిక్ గా మెప్పించినా ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక ఆ సినిమా వచ్చిన చాన్నాళ్ళకి మళ్ళీ హ్యాపీ వెడ్డింగ్ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించింది. నిహారిక ఈ హ్యాపీ వెడ్డింగ్ తో యావరేజ్ మార్కులే వేయించుకుంది. బాగా కన్ఫ్యూజన్ ఉన్న అమ్మాయిగా నిహారిక ఈ సినిమాలో బాగానే నటించింది. లుక్స్ లోను నిహారిక అందమైన ట్రెడిషనల్ డ్రెస్సులతోనే నటించింది. కానీ మేకప్ విషయంలో నిహారిక ఇంకాస్త శ్రద్ద తీసుకోవాల్సింది.
ఇక హ్యాపీ వెడ్డింగ్ సినిమాకి ఓ అన్నంత మార్కులేమి క్రిటిక్స్ వెయ్యలేదు. విడుదలకు ముందున్న బజ్ విడుదలయ్యాక సినిమా మీద లేదు. నిహారిక, సుమంత్ అశ్విన్ అన్ని కాలేజ్ లకు తిరుగుతూ సినిమా మీద హైప్ పెంచే ప్రయత్నం చేశారు. ఇక సినిమాలో ఫ్యామిలీ డ్రామా బాగున్నప్పటికీ... సుమంత్ నటన సూపర్ అయినప్పటికీ.. సుమంత్ అశ్విన్ డైలాగ్ డెలివరీ గాని.. సెకండ్ హాఫ్ లోని సాగదీత గని, ఎమోషన్స్ గాని. ఈ సినిమా పాటలు, థమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ గాని, డైరెక్షన్ గాని, స్క్రీన్ ప్లే గాని ఏమాత్రం రుచించేదిగా లేదు. మరి కేవలం ఈ సినిమాకి కెమెరా పనితనం, నిహారిక నటన, కొన్ని డైలాగ్స్ మాత్రమే మెప్పించేవిగా ఉన్నాయి. మరి నిహారికకి ఈ హ్యాపీ వెడ్డింగ్ తో కూడా ఒక మనసు లాంటి ఫలితమే దక్కింది. మరి ఈ సినిమా తర్వాత అమ్మడు మరో సినిమా కోసం మరెంత గ్యాప్ తీసుకోవాల్సి వస్తుందో చూడాలి.