మెగా డాటర్ కొణిదెల నిహారిక హీరోయిన్‌గా, సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న 'హ్యాపీవెడ్డింగ్' చిత్రం తాజాగా విడుదలైంది. తన మొదటి తెలుగు చిత్రం 'ఒక మనసు' చిత్రం సరిగా ఆడని నేపధ్యంలో నిహారిక 'హ్యాపీవెడ్డింగ్'పై ఎంతో నమ్మకం పెట్టుకుని ఉంది. ఈమె ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది.
తాజాగా ఆమె మాట్లాడుతూ తనకి పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చిందో వివరించింది. నటిగా మారినప్పటి నుంచి పెదనాన్న చిరంజీవి చిత్రంలో చిన్న పాత్రైనా చేయాలని కోరిక ఉండేది. ఇదే విషయంలో చరణ్ అన్నయ్యకి చెప్పి 'సైరా...నరిసింహారెడ్డి'లో ఓ పాత్రలో నటించాలని ఉందని కోరాను. నాకు తెలియదు.. దర్శకుడు సురేందర్‌రెడ్డిని అడగమని చెప్పాడు. సురేందర్‌ని అడిగిన వెంటనే ఒప్పుకున్నాడు. ఈ చిత్రంలో నేను ఓ బోయ యువతి పాత్రను పోషిస్తున్నాను...అని చెప్పుకొచ్చింది.
ఇక తనపై వస్తున్న గాసిప్స్ గురించి ఆమె మాట్లాడుతూ, నా గురించి వచ్చే గాసిప్స్ గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఓ నాలుగేళ్లు సినిమాలలో నటించి తర్వాత పెళ్లి చేసుకుని చిత్ర నిర్మాణ రంగంలో స్ధిరపడతాను. అందుకు అనుభవం సంపాదించేందుకు ముందుగా కొన్ని వెబ్‌సిరీస్‌లు తీసి నిర్మాణరంగంలో అనుభవం సాధిస్తాను అని చెప్పుకొచ్చింది. మొత్తానికి మెగాడాటర్ మంచి భవిష్యత్తు ప్రణాళికను రచించుకుందని చెప్పవచ్చు.