ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికే వచ్చిన పవన్‌కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఆ వెంటనే మెగాహీరోలైన వరుణ్‌తేజ్ 'తొలిప్రేమ', మరీ ముఖ్యంగా రామ్‌చరణ్ నటించిన 'రంగస్థలం' చిత్రాలు సంచలనం సృష్టించడంతో మెగాభిమానులు 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ నుంచి కాస్త కోలుకున్నారు. ఇక మెగా మేనల్లుడైన సాయిధరమ్‌తేజ్ తన చిన్నమావయ్య పవన్ కెరీర్‌ని మార్చిన చిత్రం 'తొలిప్రేమ' దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో తన పెద్దమామయ్య చిరంజీవితో ఎన్నో బ్లాక్‌బస్టర్స్ అందించిన సీనియర్ నిర్మాత, క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.యస్.రామారావు నిర్మాతగా 'తేజ్.. ఐలవ్‌యు' చిత్రం చేశాడు. కానీ ఈ చిత్రం కూడా తేజుకి హిట్ ఇవ్వలేదు. దాంతో ఆయన డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్స్‌ని నమోదు చేశాడు.
సాయిధరమ్‌తేజ్ చేస్తున్న తప్పు ఏమిటంటే.. వైవిధ్య భరితమైన కథలను కాకుండా మూస చిత్రాలు చేస్తూ ఉండటం, నటనలో పవన్‌ని, డ్యాన్స్‌ల్లో చిరుని అనుకరించడం, తన మావయ్యల పాటలను రీమిక్స్ చేసి అవే విజయాలను అందిస్తాయనే భ్రమలో ఉన్నాడని చెప్పవచ్చు. అలాంటి సమయంలో ఈయనకు క్రియేటివ్ దర్శకుడు, వైవిధ్యభరిత చిత్రాలను తీయడంతో సిద్దహస్తునిగా పేరున్న చంద్రశేఖర్ యేలేటి చిత్రంలో అవకాశం వచ్చినా దానిని కాదని తేజు పెద్ద తప్పు చేశాడు. ఇక తన మొదటి చిత్రం 'నేను..శైలజ'తో వరుస ఫ్లాప్‌లలో ఉన్న రామ్‌కి హిట్‌ని ఇచ్చి, ఆ తర్వాత వెంకటేష్‌తో పాటు నాని వంటి వారు కూడా నో చెప్పిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు అంగీకరించాడు. అయితే ఇటీవల మరలా రామ్‌తోనే కిషోర్ తిరుమల తీసిన 'ఉన్నది ఒకటే జిందగీ'తో ఆయన రెండో సినిమాకే చతికిల పడ్డాడు. మరి ఈ సమయంలో అటు దర్శకుడు కిషోర్ తిరుమలకు, హీరో సాయిధరమ్‌తేజ్‌లకు ఈ చిత్రం అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం ప్రీ పోడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే నెల సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఈ చిత్రంలో మాత్రం కథ కథనాల విషయంలో సాయి ఎంతో జాగ్రత్త తీసుకున్నాడని, ఇక ఇప్పటి వరకు తన చిత్రాలన్నింటిలో దాదాపు ఒకే రకంగా కనిపించిన సాయిధరమ్‌తేజ్ ఈ చిత్రం కోసం వెరైటీ గెటప్, లుక్, మేకోవర్‌తో రెడీ కానున్నాడని సమాచారం. దీంతో తన లుక్ మార్చుకునేందుకు తేజు దర్శక నిర్మాతలను మూడు నెలలు సమయం అడిగాడని, దానికి దర్శక నిర్మాతలు అంగీకరించడంతో ఈ చిత్రం ఆగష్టులో కాకుండా నవంబర్ లేదా డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. మరి ఈ చిత్రమైనా తేజుకి హిట్‌ని ఇస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...!