నేటిరోజుల్లో ఇంటి దొంగలు సినిమా రంగంలో కూడా ఎక్కువయ్యారు. సినిమా విడుదల కాకముందే పైరసీని విడుదల చేసే దాకా పరిస్థితి వెళ్లింది. వీటిని ఎవరో బయటి వారే చేస్తారని ఖచ్చితంగా చెప్పడానికి లేదు. ఎందుకంటే పలు సందర్భాలలో ఆ యూనిట్‌లోని వారు, మరీ ముఖ్యంగా ఎడిటింగ్ టేబుల్ నుంచే ఇవి లీక్ అవుతున్నాయి. గతంలో ఈ పని చేసింది ఆ యూనిట్‌కి చెందిన వారే అని కూడా నిరూపితం అయింది.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 'అరవింద సేమేత వీరరాఘవ' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం దసరా రేసులోకి దిగడానికి వేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇప్పటికే 50శాతం వరకు షూటింగ్ పూర్తయింది అంటున్నారు. మరోవైపు ఇందులోని ప్రధాన తారాగణంపై తాజాగా త్రివిక్రమ్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్, నాగబాబు కలిసి కనిపించే ఎమోషనల్ సీన్స్‌ని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో తీస్తున్నారు. ఈ చిత్రం సెట్స్‌లో నుంచి ఎన్టీఆర్, నాగబాబు కలిసి ఉన్న ఓ ఫొటో లీక్ అయింది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో త్రివిక్రమ్‌కి 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు ముందే లీక్ అయిన అనుభవం ఉంది.
దాంతో ఆయన తాజాగా యూనిట్ సభ్యులపై ఆంక్షలు విధించాడు. షూటింగ్ స్పాట్‌లోకి ఎవ్వరూ సెల్‌ఫోన్లు తీసుకుని రాకూడదని, అత్యవసరం అయితే షూటింగ్ స్పాట్ బయట వదిలి వచ్చిన ఫోన్‌లలో బయటికి వెళ్లి మాట్లాడాలని ఆయన ఆర్డర్ పాస్ చేశాడట. మరి ఈ విషయంలో త్రివిక్రమ్ ఇంటి దొంగలను ఎంత వరకు నియంత్రించగలడు అనేది వేచిచూడాల్సివుంది.