విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'గీత గోవిందం' గీత ఆర్ట్స్ బ్యానర్ లో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చేనెల 15 అంటే ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల కాబోతోంది. 'గీత గోవిందం' సినిమా మీద అంచనాలు ఇప్పుడు తారా స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ సోమవారం విడుదలైన గీత గోవిందం టీజర్ ఆ రేంజ్ లో అందరిని పడేసింది. ఎంతో డీసెంట్ గా ఉన్న గీత గోవిందం టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. ఇప్పటికే గీత గోవిందం సింగిల్స్, పోస్టర్స్ తో తెగ హడావిడి చేస్తున్న చిత్ర బృందం ఇప్పుడు గీత టీజర్ తో అందరిని మెస్మరైజ్ చేసింది. క్యూట్ అండ్ స్మార్ట్ లుక్స్ తో విజయ్ దేవరకొండ సూపర్బ్ గా కనిపిస్తున్నాడు. మరి టీజర్ ని చాలా జాగ్రత్తగా అందరి మనసులని తాకేలా కట్ చేసి అందులో సక్సెస్ అయ్యారు కూడా.
అయితే ఇప్పుడు ఈ సినిమాకొస్తున్న క్రేజ్ చూసి టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరు కాస్త టెంక్షన్ పడుతున్నారట. ఆయన నిర్మించిన సినిమా కూడా గీత గోవిందం సినిమా కన్నా ముందు వారమే విడుదలవుతుంది. మరి ఆ సినిమాకి ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు... నితిన్ - రాశి ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన 'శ్రీనివాస కళ్యాణం'. 'శ్రీనివాస కళ్యాణం' టీజర్ కాదు.. ఆ సినిమా పబ్లిసిటీ కూడా అందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక టీజర్ కూడా చాలా అందంగా ఆకట్టుకునేలా ఉంది. రాశి క్యూట్ లుక్స్, నితిన్ క్లాసీ లుక్స్ అందులోని ఫ్యామిలీ డైలాగ్స్ అన్ని బావున్నాయి. మరి ఆ సినిమాపై అంత అంచనాలుంటే దాని నిర్మాత దిల్ రాజు భయపడడం ఏమిటా అనుకుంటున్నారా.
శ్రీనివాస కళ్యాణం విడుదలైన ఆరో రోజే గీత గోవిందం విడుదలవుతుంది. మరి శ్రీనివాస కళ్యాణం సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే.... ఆ సినిమా మరో 15 రోజులు ఆడితే బోలెడన్ని లాభాలొస్తాయి. కానీ విజయ్ దేవరకొండ.. గీత గోవిందంలోని ప్రేమ కథ, విజయ్ దేవరకొండ కున్న భారీ క్రేజ్ అన్నీ సినిమాకి హైప్ పెంచేలా ఉన్నాయి. మరి 'శ్రీనివాస కళ్యాణం' హిట్ అయినప్పటికీ... 'గీత గోవిందం' సినిమా వచ్చేస్తుంది కాబట్టి కలెక్షన్స్ మొత్తం చీలిపోతాయి. అందుకే గీత గోవిందం మీద కన్నా తన సినిమా మీదే ఎక్కువ క్రేజ్ రావాలని దిల్ రాజు తన సినిమా ప్రమోషన్స్ ని వెరైటీ వెరైటీగా చేస్తున్నాడు. మరి అర్జున్ రెడ్డి క్రేజ్ భారీగా ఉన్న విజయ్ ముందు దిల్ రాజు గేమ్స్ ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.