ప్రపంచంలోనే మేడమ్ టుస్సాడ్స్ విగ్రహాన్ని పెట్టడం అంటే అది అరుదైన గౌరవంగానే భావిస్తారు. ఈ గౌరవాన్ని పొందిన వారు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. కానీ వారిని సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఇక తాజాగా ఈ గౌరవం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేకు దక్కనుంది. ఇటీవలే 'పద్మావత్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంలో రాణి పద్మావతిగా దీపికా పదుకొనే సంచలనం సృష్టించింది. ఈమె జన్మస్థలం కర్ణాటక. ఈమె నాటి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొనే కూతురు. ఈమద్య ఈమె బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ కూడా ఆమె అందానికి అందరు సాహో అంటున్నారు.
ఇక ఈమె కన్నడలో తన తొలిచిత్రం చేసింది. ఆ తర్వాత ఎంతోకాలానికి తమిళంలో రజనీకాంత్ నటించిన 'కొచ్చాడయన్'లో యాక్ట్ చేసింది. కాగా ఇటీవల మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకి చెందిన మైనపు విగ్రహాలను తయారు చేసే నిపుణులు వచ్చి దీపికా ఫోటోలను, కొలతలను తీసుకెళ్లారు. ఆమె విగ్రహాన్ని లండన్‌తో పాటు న్యూఢిల్లీ మ్యూజియంలో కూడా ఏర్పాటు చేయనుండటం విశేషం.
దీని గురించి దీపికా స్పందిస్తూ.. చాలా ఆతృతగా ఉంది. కృతజ్ఞురాలిగా భావిస్తున్నాను. కేవలం సినిమాల ద్వారానే కాకుండా మరో రూపంలో కూడా అభిమానులను సంతోషపెట్టడం ఆనందంగా ఉంది. ఈ మ్యూజియం ఎంతో విలువైనది. నా మైనపు బొమ్మని చూసి అభిమానులు సంతోషిస్తారని భావిస్తున్నాను. లండన్‌లోని ఈ మ్యూజియంని చిన్నతనంలో నా తల్లిదండ్రులతో చూశాను. ఇంతటి గౌరవం నాకు దక్కుతున్నందుకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నానని తెలిపింది.