ముక్కుమొహం తెలియని వారు, చిన్న వేషాలలో నటించిన వారు కూడా బిగ్‌బాస్‌లోకి ఎంటర్ అయితే తెలుగు ప్రేక్షకులందరికీ గుర్తుండిపోతారు. అలా బిగ్‌బాస్2లో పార్టిసిపెంట్‌గా పాల్గొన్న నటి భానుశ్రీ. తాజాగా ఆమె మాట్లాడుతూ, నేను 'బాహుబలి'లో తమన్నా స్నేహితురాలిగా నటించడంతో మంచి గుర్తింపు వచ్చింది. 'కుమారి21ఎఫ్, కాటమరాయుడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, మహానుభావుడు' వంటి చిత్రాలలో నటించాను. దాంతో చిన్న సినిమాలలో హీరోయిన్ అవకాశం వచ్చింది. 'ఇద్దరి మద్య 18, మౌనం, ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి' వంటి చిత్రాలలో హీరోయిన్‌గా నటించాను. 'బాహుబలి' తర్వాత నాకు వరంగల్‌లో సన్మానం చేశారు. ఒకప్పుడు సినిమాలలోకి వద్దు అన్నవారే నాకు సన్మానం చేయడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం తెలుగు, కన్నడ మూవీలో నటిస్తున్నాను.
ఇక నా అసలు పేరు స్వప్న. సినిమాలలోకి వచ్చిన తర్వాత భానుశ్రీగా పేరు మార్చుకున్నాను. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. దాంతో కొరియోగ్రాఫర్‌గా మారుతానని చెప్పాను. ఇంట్లో వారు ఒప్పుకోలేదు. దాంతో నేను దాచిపెట్టిన డబ్బులతో హైదరాబాద్ వచ్చి డ్యాన్సర్‌గా కార్డు తీసుకున్నాను. ఓ స్నేహితురాలితో కలిసి చిన్న గదిని అద్దెకు తీసుకున్నాం. కానీ అక్కడ నా బంగారు గొలుసు పోవడంతో రూమ్ నుంచి బయటికి వచ్చాను. శక్తి, డార్లింగ్ వంటి చిత్రాలలో డ్యాన్సర్‌గా పనిచేశాను. తర్వాత కొన్ని షోలలో పాల్గొన్నాను. బుల్లితెరపై 'జాబిలమ్మ' సీరియల్‌లో లీడ్‌రోల్ పోషించాను. నేను డ్యాన్సర్‌గా ఉన్నప్పుడు శివశంకర్‌రెడ్డితో పరిచయం అయింది. అతనిది కడప. నాకు ఎంతో మోరల్ సపోర్ట్‌గా నిలిచాడు. ఆయన వ్యక్తిత్వం, ఆప్యాయత నాకు నచ్చాయి. దాంతో మనం వివాహం చేసుకుందామని నేనే మొదట అతనికి ప్రపోజ్ చేశాను.
శివతోనే నా ప్రయాణం. ఆయన నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఎంతో ఆనందంగా ఉంటున్నాను. బిగ్‌బాస్ షోలో పాల్గొనడం నా అదృష్టం. చాలా మంది ఇది గేమ్ డైరెక్షన్ అనుకుంటారు. కానీ ఇది నిజాయితీగా ఉండే గేమ్‌షో. కొత్త కొత్త టాస్క్‌లు, ముక్కుసూటితనంతో అందులో పాల్గొన్నాను. అక్కడ నెలరోజులు ఉండటం ఆనందాన్ని కలిగించింది. కౌశల్‌తో చిన్న వాగ్వాదం జరిగింది. నా బిహేవియర్, స్వయంకృతాపరాధం వల్ల అది పెద్దదైంది. దీంతో నాకు మైనస్ మార్కులు పడ్డాయి' అని చెప్పుకొచ్చింది.