తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని తాను దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణికి వివరించానని, అందులో ఏవి వాడుకోవాలనేది వారిష్టమని తాజాగా 'సంజు' చిత్రం విషయంలో ఖల్‌నాయక్ సంజయ్‌దత్ తెలిపాడు. ఈయన బయోపిక్‌గా దేశం గర్వించదగ్గ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి తెరకెక్కించిన 'సంజు' చిత్రం 500కోట్లు దాటి ఇంకా ముందుకు పోతోంది. నిజంగా సంజయ్‌దత్ జీవితంలో జరిగిన ప్రతి ఘటన ఎంత దురదృష్టకరం. పగవాడికి కూడా రాకూడదని అందరు కోరుకుంటారు. కానీ ఇప్పుడు వర్మ మాత్రం మరోసారి సంజయ్‌దత్‌పై ఓ చిత్రం తీస్తానని ప్రకటించాడు. అసలు సంజయ్ దత్ వద్ద లభించిన రైఫిల్ ఎవరిది? ఎవరు ఇచ్చారు? అది సంజయ్ ఇంట్లోకి ఎలా చేరింది? అనే పాయింట్ ఆధారంగా చిత్రం తీస్తానని వర్మ చెప్పాడు.
అయినా ఇలా అందరినీ కెలకడం ఆ తర్వాత ఆయా చిత్రాలు కేవలం స్టేట్‌మెంట్స్‌కే పరిమితం కావడం గతంలో వర్మ విషయంలో ఎన్నో జరిగాయి. 'రెడ్డిగారు పోయారు, పట్టపగలు, సావిత్రి, జయలలిత, ఎన్టీఆర్స్ లక్ష్మీపార్వతి' వంటి చిత్రాలన్నీ ఈ కోవకి చెందినవే. కానీ నిజంగా వర్మకి సంజయ్ మీద చిత్రం తీయాలని ఉంటే, ఆయన నుంచే వివరాలు సేకరిస్తే బాగుంటుంది. ఇక ఈ విషయంపై సంజయ్ సోదరి నమ్రతా దత్ మండిపడ్డారు.
అక్రమాయుధాల కేసు అనేది సంజయ్ జీవితంలో జరిగిన దురదృష్ట సంఘటన. అలాంటి బాధాకరమైన విషయాలను మరలా వర్మ తీయాలనుకోవడం పద్దతి కాదు. వర్మ చిత్రాలలో చూపించేవన్నీ చీకటి కోణాలే. సంజయ్‌ని మరలా బాధ పెట్టాలనుకుంటున్నారా? మమ్మల్ని మరలా బాధలోకి నెట్టాలని చూస్తున్నారా? అయితే నా సోదరుడికి ఈ చిత్రం విషయంలో అభ్యంతరం లేకపోతే నేను అడ్డుపడను అని తన అవేదనను వెల్లడించింది. చెరిగిపోయిన గాయాలను మరలా తిరగదోడటం అంటే అది వర్మ విజ్ఞతకే వదిలేయాలి...!