రాజకీయాలలో హత్యలు ఉండవు. కేవలం ఆత్మహత్యలే ఉంటాయనే నానుడి పవన్ జనసేన, జగన్ వైసీపీలకు వర్తిస్తుందని చెప్పాలి. నిజానికి మోదీపై గళమెత్తిన వారిలో మొదటి వ్యక్తి జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్. రెండు పాచిపోయిన లడ్లు ఇచ్చారు అంటూ ఆయన నాడు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దానితో విభేదించి ప్రత్యేకహోదానే కావాలని కోరాడు. కానీ రాను రాను పవన్ మాటలు తీరు మారుతూ వచ్చాయి. అయన మోదీని, బిజెపిని, జగన్‌ని ఏమి అనకుండా కేవలం చంద్రబాబునే టార్గెట్ చేయడం ద్వారా పవన్ కూడా అందరి లాంటి పొలిటీషియనే అని, అందరిలానే ఆలోచిస్తున్నారనే విమర్శలు వస్తుండటానికి కారణం ఆయన స్వయంకృతాపరాధమే.
ఇక ప్రత్యేకహోదానే కావాలని విశాఖ ఆర్కేబీచ్‌లో ఉద్యమం చేస్తే ఆయన కూడా అందులో స్వయంగా పాల్గొనక పోవడం వల్ల అక్కడికి హాజరైన జగన్ ఆ క్రెడిట్‌ని కొట్టేశాడు. ఇక తర్వాత కూడా ఆయన తన ప్రత్యర్ధులు ఎవరో వారిని ఎంచుకుని టార్గెట్ చేయకుండా కేవలం చంద్రబాబు, లోకేష్, టిడిపిలనే ఎంచుకున్నాడు. దీంతోనే ఆయన మోదీకి పక్షపాతి, మోదీ చెప్పినట్లు నటిస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఆయన జగన్ పట్ల చూసిచూడని దోరణి వ్యవహరిస్తుండం రాజకీయంగా పెద్ద తప్పిదం. తానే స్వయంగా 175 స్థానాలలో నిలబడతానని, పోటీ చేస్తానని చెబుతున్నప్పుడు ఆయన వైసీపీని కూడా టార్గెట్ చేయాలి. ఇవేమి చేయకపోవడం వల్లనే సబ్బంహరి, లగడపాటి వంటి వారు వచ్చే ఎన్నికల్లో జనసేన, వైసీపీకి మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. ప్రజల్లోని ఈ అపోహను పవన్ పోగొట్టాలి. కేవలం టిడిపి అవిశ్వాసం పెట్టింది కాబట్టి దానికి అనుకూలంగా మాట్లాడను అనే పద్దతి సరికాదు. తెదేపా తాజాగా ప్రత్యేకహోదా, అవిశ్వాసం వంటి వాటిల్తో తమను తాము బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
అలాంటి సమయంలో వైసీపీ ఎంపీల రాజీనామాలు, మోదీకి జగన్ అనుకూలంగా ప్రవర్తిస్తున్న వైఖరిని పవన్ చూసిచూడనట్లు ప్రవర్తించడం సరికాదు. అలాగని వచ్చే ఎన్నికల్లో జగన్‌కి మద్దతు ఇస్తే, 2014లో టిడిపి గెలుస్తుందని టిడిపికి, మోదీకి మద్దతు ఇచ్చాడని, ఈసారి జగన్ గెలిచే ఉత్సాహం కనిపిస్తుండటంతో తన అవకాశవాదం చూపిస్తున్నాడన్న మాటలను కూడా ఆయన ఎదుర్కొక తప్పదు. ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా కాస్తో కూస్తో దేశంలో నిజాయితీ కలిగిన పార్టీలైన వామపక్షాలతో పవన్ ముందుకు వెళ్లడం, అవసరమైతే తెలంగాణలో గద్దర్‌తో పాటు ఇతర పార్టీలను కలుపుకుకోవడం ముఖ్యం. వామపక్షాలకు సొంతగా గెలిచే అవకాశం లేకపోయినా గెలుపు ఓటములను నిర్ణయించే నిర్ణయాత్మకశక్తిగా వారి పాత్రను విస్మరించలేం. ఒకవైపు జగన్ ప్రత్యేకహోదా విషయంలో వేస్తున్న తప్పటగులు, జనసేన అధినేత ప్రజలకు తన వైఖరి చెప్పకపోవడం చంద్రబాబుకే ప్లస్ అవుతుంది. ఇప్పటికైనా పవన్ సరైన దిశగా పయనించాలి.
ఉండవల్లి, సబ్బం హరి, లగడపాటితో పాటు జయప్రకాష్ నారాయణ్ వంటి వారు చిరంజీవి విషయంలోలాగానే 'ప్రజారాజ్యం'పై ఎలా ఆశలు పెంచుకున్నారో 'జనసేన'పై అదే నమ్మకం పెట్టుకుని ఉన్నారు. పవన్ సరైన దిశ నిర్ధేశం సూటిగా లేకపోతే వచ్చే ఎన్నికల్లో తన అభిమానులు, సామాజిక వర్గం ఓట్లతో పాటు తటస్థ ఓటర్లు కూడా జగన్,లేదా చంద్రబాబులపైనే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఫలితంగా చిరంజీవి ఎలా ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి వైఎస్ ముఖ్యమంత్రి కావడానికి పరోక్షంగా దోహదపడ్డాడో రాబోయే ఎన్నికల్లో జనసేనకి కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది.
బిజెపి, టిఆర్‌ఎస్‌ల ధోరణిని ఎండగట్టడంతో పవన్, జగన్‌లు చేస్తున్న తప్పిదాలను చంద్రబాబే అనుకూలంగా మార్చుకోవాల్సివస్తుంది. ఇక కేవలం తన సామాజిక వర్గం ఓట్లపై పవన్ ఆధారపడటం కుదరదు. ఎందుకంటే ఆల్‌రెడీ అదే సామాజిక వర్గానికి చెందిన వారుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నాలక్ష్మీనారాయణ, వైసీపీ ముద్రగడ పద్మనాభం, మధ్యలో జేడీ లక్ష్మీనారాయణలు కూడా అదే పనిలో ఉన్నారనే విషయం జనసేనాధినేత గుర్తించాల్సివుంది.