పాత రోజులు, తాము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా చేసిన సాయం గురించి కృతజ్ఞత లేని వాడు మనిషే కాదు. గొప్పగొప్ప చరిత్ర సృష్టించిన ఎందరికో ఎందరో ఏదో ఒక సాయం చేసిన విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి వారిని కనీసం గుర్తుంచుకోవడం మానవధర్మం. ఇక విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి తనయుడు కెరీరే కాదు.. ఆ ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరి కెరీర్ వడ్డించిన విస్తరే. దీని వెనుక కెరీర్ తొలినాళ్లలో సహకరించిన నిర్మాతలు, దర్శకులు, స్నేహితులు, మీడియా కూడా ఎందరో ఉంటారు. ఇక విషయానికి వస్తే చేసిన సాయం మరవని వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని చిరంజీవి నిరూపించుకున్నాడు. తనకు కెరీర్‌లో సుప్రీం స్టార్ నుంచి మెగాస్టార్‌గా ఎదగడంలో ఎంతో సహకరించిన క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.యస్ రామారావుకి రామ్‌చరణ్ సినిమా చేయనున్నట్లు చిరునే ప్రకటించాడు. అలాగే తనకి ఎంతో కొంత సాయం చేసిన అశ్వనీదత్ బేనర్‌లో కూడా త్వరలో చిరు ఓ చిత్రం చేయనున్నట్లు సమాచారం.
ఇక విషయానికి వస్తే తాజాగా ఎం.ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా మెగాడాటర్ కొణిదెల నిహారిక హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'హ్యాపీవెడ్డింగ్'. ఈ చిత్రం వేడుకలో రామ్‌చరణ్ పాల్గొని ఓ ఆసక్తికర సంఘటన చెప్పుకొచ్చాడు. ఈ వేడుకకు నేను నిహారిక కోసం రాలేదు. కేవలం ఎం.ఎస్ రాజు గారి కోసమే వచ్చాను. సుమంత్ ఎంతో హార్డ్‌వర్కింగ్. తన కెరీర్‌కి ఇది మైల్‌స్టోన్ అవుతుంది. ఎమ్మెస్ రాజుగారితో మాకున్న అనుబంధం ఈనాటిది కాదు. నెలక్రితం నేను, నాన్న కూర్చుని మాట్లాడే సమయంలో ఎం.ఎస్ రాజు గారి ప్రస్తావన వచ్చింది. నాన్నగారు 1980లలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పారు. నాడు నాన్నగారు ఎంతో మంది నిర్మాతలతో పనిచేస్తూ ఉండేవారు. ఓ నెల నాన్నకి, అమ్మకి డబ్బు సరిపోక అవసరం వచ్చింది. నాన్నగారు పనిచేస్తున్న ముగ్గురు నిర్మాతలను ఐదు వేలు అడిగితే వారు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. చివరకు ఎం.ఎస్ రాజు గాని నాన్నగారైన అయ్యప్పరాజు నాన్న అడినప్పుడు ప్రతిఫలం ఆశించకుండా వెంటనే డబ్బు ఇచ్చారట.. ఈ విషయం నాన్నగారు చెప్పారు.
అందుకే రాజుగారి ఫోన్ చేసి అడిగిన వెంటనే అది నా బాధ్యత వస్తానని చెప్పాను. నేను రావడం గొప్పతనం కాదు. ఆయన గొప్పతనాన్ని చెప్పేందుకే నేను ఇక్కడికి వచ్చాను. టాలెంట్ ఉన్న బ్యాడ్ యాటిట్యూడ్‌తో ఉన్న వారికి భవిష్యత్తు కష్టం. పెద్దగా టాలెంట్ లేకపోయినా మంచి యాటిట్యూడ్ ఉన్నవారికి భవిష్యత్తులో మంచి సక్సెస్ వస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక రాజుగారు 'ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి చిత్రాలతో ఓ వెలుగు వెలిగారు. దానికి ప్రతిఫలంగానో ఏమో గానీ ప్రభాస్ సొంత సంస్థ వంటి యువి క్రియేషన్స్ అశ్విన్‌తో ఈ చిత్రం తీసింది. మరలా రాజు గారి వంటి మంచి నిర్మాతలు నిలబడాలంటే చిరు, లేదా చరణ్‌లలో ఎవరో ఒకరు ఆయనకి ఓ చిత్రం చేస్తే బాగుంటుంది..!