కొన్ని చిత్రాలను ఏమి చూసి అరుదైన గౌరవాలకు ఎంపిక చేస్తారో కూడా అర్ధం కాని పరిస్థితి అనే చెప్పాలి. ఇక 'బాహుబలి' అంటే అదో ప్రత్యేకమైన చిత్రం. ఇక విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జైలవకుశ' కలెక్షన్ల పరంగా బాగానే వసూలు చేసి ఉంటే వసూలు చేసి ఉండవచ్చు. కానీ ఈ చిత్రంలో కథ పాత చింతకాయ పచ్చడి. కేవలం ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం మరీ ముఖ్యంగా జై పాత్రలే నిలబెట్టాయి. ఈ చిత్రం విజాయాన్ని కేవలం 'జై' పాత్రను ఎన్టీఆర్ పోషించిన తీరు మాత్రమే అలరించింది. ఇక ఈ చిత్రం హిట్టా ఫ్లాపా? అనే విషయంలో పలు వాదనలు ఉన్నాయి. రివ్యూలు, నిజమైన కలెక్షన్లను బట్టి ఈ చిత్రం ఎబౌ యావరేజ్ అని, నిర్మాత కళ్యాణ్‌రామ్‌కి మాత్రం బాగానే గిట్టిందని వార్తలు వచ్చాయి.
ఇక జై పాత్రకు నిజంగా 'భారతీయుడు' తరహాలో ప్రోస్థటిక్ మేకప్ చేసి ఉంటే దీనికి మరింత నిండుదనం వచ్చేదని మాత్రం ఘంటాపధంగా చెప్పవచ్చు. కానీ ఏదో మామూలు రొటీన్ చిత్రం తరహాలోనే వచ్చిన చిత్రంగా, కేవలం కలెక్షన్లు ప్రాతిపదిక మీదనే గానీ మరే కొత్తదనం లేని చిత్రం. కానీ అనూహ్యంగా ఈ చిత్రానికి ఓ అనుకోని గౌరవం దక్కింది. సౌత్ కొరియాలో జరిగే బూచియోన్ అంతర్జాతీయ ఫెస్టివల్‌లో రెండు రోజుల ప్రదర్శనకు గాను ఈ చిత్రాన్ని ఎంపిక చేశారు.
ఉత్తమ ఏషియన్ విభాగంతో ఈ చిత్రానికి ఆ గౌరవం దక్కింది. ఈ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైన ఏకైక తెలుగు చిత్రం 'జైలవకుశ' కావడం విశేషం, నిజానికి ఈ చిత్రం కంటే ఎన్టీఆర్ అంతకు ముందు చేసిన 'టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్'వంటివివే ఉత్తమంగా విశ్లేషకులు భావిస్తారు. మరి వాటికేమీ రాని గౌరవం 'జైలవకుశ'కు రావడం వైచిత్రే మరి అని చెప్పాలి..!