ఈ శుక్రవారం ఏకంగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందు క్యూ కట్టాయి. ఈ మధ్య కాలంలో పొలోమంటూ సినిమాలు బాక్సాఫీసు మీద దాడి చెయ్యడమే కాని... అందులో ఒకటి అరా మాత్రమే ప్రేక్షులకు రీచ్ కాగలుగుతున్నాయి. గత వారం విడుదలైన విజేత ప్లాప్ అవగా... చినబాబు ఓ మోస్తరు హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ మరో చిన్న సినిమా యావరేజ్ టాక్ తో కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. RX 100 అనే సినిమా చిన్నగా యూత్ కి కనెక్ట్ అయ్యి ఆ సినిమా సేఫ్ జోన్ లోకి రావడమే కాదు.. సూపర్ హిట్ అయ్యింది కూడా. ఇక ఈ వారం కూడా మూడు నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. శుక్రవారం దిల్ రాజు బ్యానర్ లో హీరో రాజ్ తరుణ్ లవర్ సినిమాతో రాగా... లక్ష్మి మంచు వైఫ్ ఆఫ్ రామ్ అంటూ దిగింది. ఇక చంద్ర సిద్దార్ధ్ డైరెక్షన్ లో అంతా కొత్తవాళ్లతో ఆటగదరా శివ సినిమా విడుదలైంది. ఇక ఈ రోజు శనివారం మరో చిన్న సినిమా పరిచయం కూడా విడుదల కాబోతుంది.
మరి ఈ నాలుగు సినిమాల్లోను ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను శాటిస్ ఫై చేయలేకపోయాయి అని ఆ సినిమాలు విడుదలైన గంటకే తెలిసిపోయింది. రాజ్ తరుణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న లవర్ మూవీ రొటీన్ కథతో అనీష్ కృష్ణ ప్రేక్షకులకు బోర్ కొట్టించేయ్యగా... మంచు లక్ష్మి మెయిన్ లీడ్ లో తెరకెక్కిన వైఫ్ ఆఫ్ రామ్ సినిమాలో విషయం ఉన్నప్పటికీ.. ఆ సినిమాని దర్శకుడు నడిపించిన తీరు ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో మంచి ట్విస్ట్ లు ఉన్నప్పటికీ... కథనంలో దర్శకుడు తడబాటుతో ఆ సినిమా కూడా యావరేజ్ లిస్టులోకెళ్ళిపోయింది. ఇక ఆ నలుగురు వంటి నలుగురు గుర్తు పెట్టుకుని మూవీస్ చేసిన చంద్ర సిద్దార్ధ్ ఆటగదరా శివ అనే సినిమాని కొత్త వాళ్లతో చేసి చేతులు కాల్చుకున్నాడు .
ఇక ఈ రోజు శనివారం విడుదలకాబోయే పరిచయం మూవీ ప్రీమియర్స్ వీక్షించిన వాళ్ళు కూడా పరిచయం సినిమాలో కూడా విషయం లేదంటున్నారు. మరి ఈ వారం విడుదలైన ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీసు వద్ద చేతులెత్తేసి.. ప్రేక్షకులను నిరాశలో పడేశాయి. మరి మే నుండి ఇలానే ప్రతివారం యేవో నాలుగైదు సినిమాలు విడుదలవడం... ఇలా సినిమాలన్నీ ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో .. ప్రేక్షకులు కొత్త సినిమాలోని కొత్తదనం కోసం మొహం వాచిపోయేలా ఉన్నారు. ఇలాంటి టైంలో ఒక్క గట్టి సినిమా దిగిందా ఆ నిర్మాతలకు కాసుల పంట. ఇక వచ్చే వారం రేసులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - పూజా హెగ్డే ల సాక్ష్యం చిత్రంతో పాటుగా మెగా డాటర్ నిహారిక హ్యాపీ వెడ్డింగ్ సినిమాలు ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాల మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.