ప్రతి భాషలోనూ అనేక భారీ డిజాస్టర్స్ ఉంటాయి. ఇలాంటివి మన దేశంలోనే కాదు.. హాలీవుడ్‌లో కూడా ఎన్నో ఉన్నాయి. ఇక చైనీస్ భాషల్లో తాజాగా విడుదలైన ఓ చిత్రం అత్యంత భారీ డిజాస్టర్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 113 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందింది. అంతే మన కరెన్సీ ప్రకారం దీని బడ్జెట్ రూ.700కోట్లు. ఇంత బడ్జెట్‌ను ఈ చిత్రం కోసం పెట్టారంటే ఈ చిత్రంపై యూనిట్‌కి ఎంత నమ్మకం ఉందో అర్ధమవుతోంది. కానీ అనూహ్యంగా ఈ చిత్రాన్ని తొలి వారంలోనే థియేటర్ల నుంచి తొలగిస్తారని ఈ చిత్రం బృందం కలలో కూడా ఊహించి ఉండదు. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది.
చైనాకు చెందిన అలీబాబా పిక్చర్స్ సంస్థ 'అసుర' అనే చిత్రాన్ని నిర్మించింది. చైనా సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలలో ఇది ఒకటిగా చెప్పుకున్నారు. టిబెటన్ బుద్దిస్ట్‌ల పౌరాణిక కథల నేపధ్యంలో ఈ చిత్రం కథను ఎంచుకున్నారు. సహజంగా ఇలాంటి తరహా చిత్రాలను చైనీయులు బాగానే ఆదరిస్తారు. కానీ ఇటీవల మన 'బాహుబలి' కంటే అమీర్‌ఖాన్ 'దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్' వంటి చిత్రాలు చైనాలో అతి పెద్ద విజయం సాధించాయి. దానిని బట్టి చైనీయులు అభిరుచిలో, ట్రెండ్‌లో కూడా మార్పు వచ్చిందని స్పష్టమవుతోంది. అది 'అసుర'తో మరింతగా నిజమని తేలిపోయింది. ఈ సినిమా కోసం భారీ గ్రాఫిక్స్ స్పెషల్ ఎఫెక్ట్స్‌ని వాడారు. ఎన్నో ఆశలతో ఈ చిత్రాన్ని గత శుక్రవారం విడుదల చేశారు. కానీ సినిమాపై చిత్రబృందం పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి.
శనివారానికి ఈ చిత్రం కేవలం 7.3 మిలియన్ డాలర్లను మాత్రమే రాబట్టింది. దాంతో దీనిని అట్టర్‌ఫ్లాప్‌కింద నిర్ణయించి ఆదివారం రాత్రి 10 గంటల నుంచి ఈ చిత్రాన్ని థియేటర్ల నుంచి తీసివేశారు. ఈ సినిమా చూడాలనుకుంటున్న ప్రేక్షకులకు క్షమాపణలు. ఎందుకంటే ఈ చిత్రాన్ని థియేటర్ల నుంచి తొలగించాలని నిర్ణయించామని థియేటర్ల యజమానులు తెలిపారు.ఈ 'అసుర' చిత్రం ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద డిజాస్టర్స్‌గా నిలిచిన చిత్రాలలో ఐదో స్థానాన్ని తన పేరు మీద లిఖించుకుంది. చైనాలో ఇదే ప్రధమస్దానం సాధించింది. ఈ చిత్రం 106మిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసి, చిత్ర నిర్మాతలను, బయ్యర్లను బజారుపాలు చేసిందని చెప్పవచ్చు.