ప్రస్తుతం వినోదం పేరుతో, ఎంటర్‌టైన్‌మెంట్ చానెల్స్‌లో వస్తున్న పలు కార్యక్రమాలపై సమాజంలోని మేధావులు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు మాత్రం ఇలాంటి కార్యక్రమాలను ఏదో వినోదం కోసం చూసి వదిలేయాలే గానీ దానిపై మరీ క్షుణ్ణంగా పరిశీలించడం అనవసరం అని అంటుంటే.. మరికొందరు మాత్రం ఇలాంటి షోల వల్ల యువత పెడదారి పడుతోందని, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో యువత తమ విలువైన సమయాన్ని వృదా చేసుకుంటోందని ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈటీవీలో వచ్చే 'జబర్ధస్త్', ఈటీవీ ప్లస్‌లో వచ్చే 'పటాస్' వంటి కార్యక్రమాలను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.
అయితే ఇప్పటికే దేశవిదేశాలలో ఎంతో పేరు తెచ్చుకున్న వివాదాస్పదమైన గేమ్‌షో బిగ్‌బాస్‌పై ఈ విమర్శల దాడి ఎక్కువగా ఉంటోంది. ఇది మానవహక్కులను ఉల్లంఘించడమేనని, ఇదంతా ఓ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోందనే విమర్శలు, ఇందులో పాల్గొంటున్న పార్టిసిపెంట్స్ పబ్లిసిటీ కోసం వాడుతున్న భాష, చేష్టలు కొందరికి నచ్చడం లేదు. తాజాగా మాజీ సిబిఐ జెడీ లక్ష్మీనారాయణ బిగ్‌బాస్‌పై తాజాగా స్పందించారు. బిగ్‌బాస్ కోసమని మన యువత ఎంతో విలువైన రెండు గంటల సమయాన్ని వృదా చేసుకోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
దేశానికి ఉపయోగపడేలా యువత మారాలంటే కొన్ని విషయాలను ఆచరించాలని ఆయన సూచించారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలని, అదే సమయంలో మీ మెదడును మీ కంట్రోల్‌లోఉంచుకోవాలని ఆయన సూచించారు. స్వామి వివేకానంద చెప్పినట్లు మన శ్వాసను మనం కంట్రోల్‌లో ఉంచుకోగలిగితే మన మైండ్ మన కంట్రోల్‌లో ఉంటుందని ఆయన చెప్పారు. దీనికి ప్రాణాయామం చేయడం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. బిగ్ బాస్ షో మొత్తం బిగ్ బాస్ కంట్రోల్‌లో నడుస్తోందని, అందరి మెదడ్లను బిగ్‌బాస్ కంట్రోల్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. బిగ్‌బాస్‌ని మాత్రం ఎవ్వరూ కంట్రోల్ చేయడం లేదు. మన మైండ్‌ని మనమే కంట్రోల్ చేసుకోవాలంటే ప్రాణాయామం చేయాలి.. అని జెడీ లక్ష్మీనారాయణ సూచించారు.