దాదాపు 1500లకు పైగా చిత్రాలలో నటించిన గొప్ప నటి రమాప్రభ. కామెడీ పాత్రలు, సపోర్టింగ్, క్యారెక్టర్ రోల్స్, కాస్త వ్యాంపు తరహా పాత్రలతో ఆమె నిత్యం ఎంతో బిజీగా గడిపేవారు. నాటి రేలంగి.. రమణారెడ్డి, అల్లురామలింగయ్య, పద్మనాభం, రాజబాబు, చలం.. వంటి ఎందరితోనో ఈమె కలిసి నటించింది. ఇక ఈమె ఆ తర్వాత బామ్మ పాత్రలు కూడా చేస్తూ వయసుకు తగ్గపాత్రలు వున్న చిత్రాలు చేస్తూ వచ్చింది. కానీ ఈమె వృత్తిగత జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. తోటి సహనటుడు శరత్‌బాబుని వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులతో విడిపోయింది. ఈమెని తన కెరీర్‌కి శరత్‌బాబు నిచ్చెనగా వాడుకుని వదిలేశాడని, ఈమె సంపాదనంతా ఆయన నాశనం చేశాడని పలు వార్తలు వచ్చాయి.
ఇక ఈమె ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని మదనపల్లి సమీపంలో షిర్డీ సాయి బాబా సేవలో తరిస్తూ, సినిమాలకు దూరంగా ఉంది. ఈమె తాజాగా మాట్లాడుతూ, నాకు 'చిలక గోరింక'లో హీరోయిన్‌కి సమానమైన పాత్ర లభించింది. దాంతో నేను హీరోయిన్‌గా రాణించలేనని అర్ధం అయింది. హీరోయిన్ అంటే కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుందని, వైవిధ్యపాత్రలు చేసే అవకాశం ఉండదని అర్ధమైంది. నేను ఎన్నో చిత్రాలలో చేసినా.. ఎంతో పేరు తెచ్చుకున్నా కూడా నాకు 'పద్మశ్రీ' కూడా ఇవ్వలేదు. నా రేంజ్ అంతగా పెరగకూడదు కదా...! అందుకే ఇవ్వలేదు. పైస్థాయిలో ఉన్న వారు నన్ను కిందకి దించారు. నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు చెన్నైలో ఉన్నట్లుగా ఉండకూడదు కదా...! అందుకే దూరం పెట్టారు.
నా స్థాయిని తగ్గించాలని నా కన్నా తక్కువ స్థాయి వారే కదా అనుకుంటారు! అప్పుడు అది కూడా గ్రేటేనని నేను భావించాను. అందుకని నాకేదైనా అయితే మా అసోసియేషన్‌కి గానీ, పరిశ్రమకు గానీ చెప్పవద్దని నా వారికి చెప్పాను. ఎందుకంటే ఇప్పుడున్న సినిమా వాళ్లలో నిజంగా ఏడ్చేవారు ఎవ్వరూ లేరు. మానసికంగా నన్ను ఇక్కడికి తరిమింది వారే కదా..! నేను విడమర్చి చెప్పలేను గానీ కోల్డ్‌వార్‌లా జరుగుతోంది అని రమాప్రభ ఆవేదన వ్యక్తం చేసింది.