కొన్ని కొన్ని పాత్రలను, అందునా వివాదాస్పద బయోపిక్‌ల్లో నటించి మెప్పించడం అంటే మాటలు కాదు. అది ఎం ఎస్ ధోని అయినా మేరీ కోమ్ అయినా, చివరకు 'సంజు, మహానటి' చిత్రాలలో నటించడం అనుకున్నంత సులభం కాదు. ఒరిజనల్ వ్యక్తికి సంబంధించిన లుక్, బాడీలాంగ్వేజ్ నుంచి ప్రతి ఒక్కదానిని అందరూ నిశితంగా పరిశీలిస్తారు. అలాంటి 'మహానటి'లోని సావిత్రి పాత్ర మరెవ్వరు చేసి ఉన్నా విమర్శలు వచ్చేవో లేక ప్రశంసలు లభించేవో తెలియదు గానీ ఇందులో సావిత్రిగా నటించిన కీర్తిసురేష్‌పై మాత్రం ప్రశంసల జల్లు కురిసింది.
ముఖ్యంగా ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ అదరగొట్టింది. తమిళ ప్రజలైతే ఆమెకి నీరాజనాలు పలుకుతున్నారు. అంతేకాదు.. ఆమెకి ఖుష్బూ, నమితలాగా గుళ్లు కూడా కడుతున్నారు. ఈ సందర్భంలో కీర్తిసురేష్ తన పారితోషికాన్ని విపరీతంగా పెంచేసిందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై కీర్తి స్పందిస్తూ.. నేను డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో సినిమా ఫీల్డ్‌లోకి రాలేదు. కేవలం మంచి చిత్రాలు, మంచి పాత్రలు చేసి గొప్ప నటిగా పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో వచ్చాను. దీపం ఉండగానే ఇల్లు సరిదిద్దుకోవాలనే నానుడి ఉంది. దీనిని నేను ఏమాత్రం పట్టించుకోను. కష్టపడి నటించి పేరు తెచ్చుకుని నా కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రమే ఆశిస్తాను... అని క్లారిటీ ఇచ్చింది.
కాగా ప్రస్తుతం కీర్తిసురేష్, విక్రమ్ హీరోగా నటిస్తున్న 'సామి స్క్వేర్', విజయ్-మురుగదాస్‌ల 'సర్కార్', విశాల్ 'సండకోళి 2' చిత్రాలతో పాటు శివకార్తికేయన్ నటిస్తున్న 'సీమరాజా' చిత్రంలో అతిధి పాత్రను పోషిస్తోంది.