మిగిలిన రంగాల కంటే సినిమా రంగంలో ఒక మంచి విధానం ఉంది. ఇక్కడ అందరికీ రెమ్యూనరేషన్లు చెల్లించి, ఎన్‌ఓసీ తీసుకుని వస్తేనే సినిమా ల్యాబ్ నుంచి బయటకు వస్తుంది. అయితే ఇక్కడ కూడా కొందరు ముదుర్లు ఉంటారు. నానా మాటలు చెప్పి, ఇబ్బందుల్లో ఉన్నామని, తర్వాత ఇస్తామని చెప్పి మోసం చేసేవారికి కూడా కొదవలేదు. ఏకంగా పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ 'అత్తారింటికి దారేది' చిత్రంలో మిగిలిన రెమ్యూనరేషన్‌ని 'నాన్నకు ప్రేమతో' విడుదలకు ముందే చెల్లిస్తానని మాట ఇవ్వడం, ఆతర్వాత మాట నిలబెట్టుకోకపోవడంతో ఆ చిత్రం విడుదలకు ముందే పవన్, త్రివిక్రమ్‌లు ఆయనపై ఫిర్యాదు చేసి మరీ తమకి రావాల్సింది రాబట్టారు.
ఇక రెగ్యులర్ నిర్మాతలు మాత్రం ఇలా చేయరు. ఎందుకంటే ఇలా చేస్తే వారికి తదుపరి చిత్రాలు చేసే అవకాశం ఉండదు. ఇక ప్రస్తుతం తెలుగులో అల్లుఅరవింద్, దిల్‌రాజు, మైత్రి మూవీమేకర్స్, యువి క్రియేషన్స్ వంటి వారి కంటే స్పీడుగా దూసుకుపోతున్న నిర్మాత డివివి దానయ్య. ఈయన ప్రస్తుతం బోయపాటి, రామ్‌చరణ్ చిత్రం, రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మల్టీస్టారర్‌తో పాటు త్వరలో అల్లుఅర్జున్‌తో కూడా చిత్రం తీయడానికి సిద్దమవుతున్నాడు. ఇటీవల ఆయన నిర్మాతగా డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు, కైరా అద్వానీలతో 'భరత్ అనే నేను' చిత్రం నిర్మించాడు. ఈ చిత్రం మహేష్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి దానయ్య కొరటాల శివకు, కైరా అద్వానీకీ పూర్తిగా రెమ్యూనరేషన్ చెల్లించలేదని వార్తలు వస్తున్నాయి.
దీంతో దానయ్య స్పందిస్తూ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దని, తాను ఎవరికి బాకీ లేనని, కావాలంటే తన ఆఫీసుకు వచ్చి వివరాలు తీసుకోవచ్చని సూచించాడు . తాజాగా కొరటాల శివ కూడా మాట్లాడుతూ, నాకు తెలిసి రామానాయుడు తర్వాత అంత మంచి నిర్మాత, ప్లానింగ్ ఉన్న వ్యక్తి దానయ్య. ఆయన మా అందరికీ పైసలతో సహా చెల్లించారు. అలా చెల్లించకపోతే ఆయన ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్స్‌ని ఎలా చేయగలుగుతారు? అని ప్రశ్నించాడు. మొత్తానికి ఇలాంటి వార్తలు ఎవరు పుటిస్తారో గానీ వారి వల్ల జర్నలిస్ట్‌లు అందరికీ చెడ్డ పేరు వస్తోంది.